ఎనిమిది జట్లు.. 15 మ్యాచులు.. దాదాపు 20 రోజుల పాటు అభిమానులను అలరించేందుకు ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ(ICC Champions Trophy-2025) సిద్ధమైంది. మినీ వరల్డ్ కప్‌గా భావించే ఈ ఈవెంట్ నేటి (ఫిబ్రవరి 19) నుంచి మార్చి 9వ తేదీ వరకు జరగనుంది. ప్రారంభ మ్యాచ్‌లో ఆతిథ్య పాకిస్థాన్ వర్సెస్ న్యూజిలాండ్(PAKvsNZ) జట్లు తలపడనున్నాయి. 1996 వన్డే వరల్డ్‌కప్ తర్వాత ఆ దేశంలో జరుగబోతున్న అతిపెద్ద క్రీడా టోర్నీ ఇదే కావడం విశేషం. ఛాంపియన్స్ ట్రోఫీని మొదటిసారి 1998లో నిర్వహించగా, అప్పట్లో దీన్ని ఐసీసీ నాకౌట్ ట్రోఫీ(ICC Knockout Trophy)గా పిలిచేవారు. కానీ 2002 నుంచి ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీగా పేరుగా నామకరణం చేశారు. అలాగే 2009 నుంచి నాలుగేళ్లకోసారి జరపాలని నిర్ణయించారు. కానీ 2017లో ఈ టోర్నీకి బ్రేక్ వేసిన ఐసీసీ మళ్లీ ఏ ఏడాది నుంచి నిర్వహించాలని నిర్ణయించింది.
టాప్-8లో నిలిచిన జట్ల మధ్యే పోరు
పాకిస్థాన్, UAE సంయుక్తంగా నిర్వహించే ఈ టోర్నీలో.. ఐసీసీ ర్యాంకింగ్స్‌లో టాప్-8లో నిలిచిన జట్లు ఈ టోర్నీలో పాల్గొంటున్నాయి. గ్రూప్-ఏలో భారత్, పాకిస్థాన్, న్యూజిలాండ్, బంగ్లాదేశ్ ఉండగా.. గ్రూప్-బిలో ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, సౌతాఫ్రికా, అఫ్గానిస్థాన్ జట్లు ఉన్నాయి. ప్రతి జట్టులో గ్రూపులోని ఒక్కో జట్టుతో ఒక్కో మ్యాచు ఆడుతుంది. టాప్-2లో నిలిచిన జట్లు సెమీస్‌కు చేరుకుంటాయి. ఆ తర్వాత టైటిల్ పోరు ఉంటుంది. షెడ్యూల్ ప్రకారం ఫైనల్ మ్యాచ్ లాహోర్‌లో జరుగుతుంది. ఒకవేళ భారత్ తుది పోరుకు అర్హత సాధిస్తే వేదిక దుబాయ్‌కు మారుతుంది. ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచులు జియో హాట్‌స్టార్, స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్, స్పోర్ట్స్ 18లలో ప్రత్యక్ష ప్రసారం కానుంది.







