Mana Enadu : తెలంగాణలో ప్రస్తుతం పుష్ప-2 బెనిఫిట్ షో (Pushpa 2) సమయంలో సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో మహిళ మృతి, ఆ తర్వాత ఆ కేసులోనే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) అరెస్టు, బెయిల్ పై విడుదల.. అనంతరం సినీ ప్రముఖులు ఆయణ్ను కలవడం.. తాజాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth News) అసెంబ్లీ సాక్షిగా చేసిన ప్రకటన చర్చనీయాంశమవుతోంది. అయితే అసెంబ్లీ వేదికగా సీఎం.. అల్లు అర్జున్ పై కీలక వ్యాఖ్యలు చేశారు. పుష్ప-2 బెనిఫిట్ షోలో జరిగిన ఘటనతో.. రాష్ట్ర వ్యాప్తంగా ఇకపై బెనిఫిట్ షోలు.. టికెట్ రేట్ల పెంపు కూడా ఉండదని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో తాజాగా అల్లు అర్జున్ ప్రెస్ మీట్ (Allu Arjun Press Mee) పెట్టారు. హైదరాబాద్ లోని ఆయన మీడియాతో మాట్లాడారు.
శ్రీతేజ కుటుంబానికి నా క్షమాపణలు
“సంధ్య థియేటర్ వద్ద పుష్ప-2 బెనిఫిట్ షో సమయంలో జరిగింది పూర్తిగా ప్రమాదవశాత్తు ఘటన. ఇందులో ఎవరి తప్పిదం లేదు. ఒకరి తప్పు వల్ల జరిగిన ఘటన కాదు ఇది. నేను ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడానికీ.. వాళ్లనీ ఆనందపరచడానికి మాత్రమే థియేటర్ కు వెళ్లాను. రేవతి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి. శ్రీతేజ ఆరోగ్యం (Sritej Health Updates) గురించి కూడా గంట గంటకు అప్డేట్స్ తెలుసుకుంటున్నాను. అతను ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడని డాక్టర్స్ చెబుతున్నారు. రేవతి కుటుంబానికి నా క్షమాపణలు. పిల్లలు ఆస్పత్రిలో ఉన్నారంటే మా వాళ్లను పంపించాను. నేను కూడా ఆస్పత్రికి వెళ్తానంటే వద్దని అన్నారు. ఆస్పత్రికి వెళ్తే మరో ఘటన జరుగుతుంది కాబట్టి వద్దన్నారు.
నా క్యారెక్టర్ ను కించపరిచారు
సంధ్య థియేటర్ (Sandhya Theatre Stampede) ఘటనపై మిస్ ఇన్‌ఫర్మేషన్, మిస్ కమ్యూనికేషన్ జరుగుతోంది. కాళ్లు చేతులూ విరిగాయా అని జాతీయ మీడియాలో మాట్లాడటం చాలా బాధగా అనిపించింది. నాపై తప్పుడు ఆరోపణలు చేయడం విచారకరం. ఈ ఘటన విషయంలో నా క్యారెక్టర్‌ను కించరపరిచారు. పోలీసులు చెప్పినట్లే నేను నడుచుకున్నాను. నా మీద కొంత తప్పుడు ప్రచారం జరుగుతోంది. ఘటన సమయంలో నేను ఏదో మాట్లాడానని అంటున్నారు.” అల్లు అర్జున్ తెలిపారు.
నేను రోడ్ షో చేయలేదు
థియేటర్ ముందు తాను రోడ్ షో చేయలేదని అల్లు అర్జున్ తెలిపారు. లోపలికి వెళ్తున్నప్పుడు ఒక్క నిమిషమే కారు ఆగిందని.. అభిమానులకు కృతజ్ఞతలు చెబుతూ ముందుకు వెళ్లమని చెప్పానని వెల్లడించారు. అయితే థియేటర్ లోనికి వెళ్లిన తర్వాత తన వద్దకూ పోలీసులు ఎవరూ రాలేదని, చాలా సేపటి తర్వాత మా టీమ్ వచ్చి జనం అధికంగా గుమికూడారు వెళ్లమని చెప్తే వెళ్లిపోయానని చెప్పారు. బయట జరిగిన విషయం తనకు మరుసటి రోజు వరకూ తెలియదని అల్లు అర్జున్ పేర్కొన్నారు. తెలుగోడి సత్తా చూపించాలని తాను సినిమాలు చేస్తుంటే.. తన క్యారెక్టర్ ను కించపరిచేలా తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని వాపోయారు.






