గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజినీరింగ్ (GATE 2025) ఫలితాలు రిలీజయ్యాయి. ఈ మేరకు ఎగ్జామ్ రాసిన అభ్యర్థులు తమ ఫలితాలను https://goaps.iitr.ac.in/login వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు. అందుకు అభ్యర్థులు తమ ఎన్‌రోల్‌మెంట్ ఐడీ/ఈ-మెయిల్ అడ్రస్, పాస్‌వర్డ్ వంటి వివరాలను ఎంటర్ చేసి స్కోరు కార్డు పొందవచ్చు. ఇదిలా ఉండగా మే 31 తర్వాత డౌన్‌లోడ్ చేస్తే రూ.500 చెల్లించాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు.
దేశవ్యాప్తంగా 8.37 లక్షల మంది దరఖాస్తు
ఈ మేరకు దేశంలోని IITలు సహా పలు ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థల్లో M Tech, PHD కోర్సుల్లో ప్రవేశాలకు మొత్తం 30 సబ్జెక్టులకు నిర్వహించిన GATE పరీక్ష ఫలితాలను అధికారులు రిలీజ్ చేశారు. అభ్యర్థుల ర్యాంకుల ఆధారంగా ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (IISc) బెంగళూరు, IIT బాంబే, IIT ఢిల్లీ, IIT గౌహతి, IIT కాన్పూర్, IIT ఖరగ్‌పూర్, IIT మద్రాస్, IIT రూర్కీలలో సీట్లు సీట్లు లభిస్తాయి. కాగా దేశవ్యాప్తంగా మొత్తం 8.37 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా సుమారు 80 శాతం మంది పరీక్షకు హాజరయ్యారు.

స్కోరు కార్డుల డౌన్‌లోడ్‌కు అప్పటివరకే ఛాన్స్
వీరికి ఫిబ్రవరి 1, 2, 15, 16 తేదీల్లో పరీక్షలు జరగగా.. ఇటీవల ప్రాథమిక కీ విడుదల చేశారు IITరూర్కీ అధికారులు. అయితే తాజాగా రిలీజ్ చేసిన స్కోరు కార్డులు మార్చి 28 నుంచి మే 31వరకు డౌన్‌లోడ్‌కు అందుబాటులో ఉంటాయని తెలిపారు. ఈ గడువు దాటిన తర్వాత స్కోర్ కార్డులు(Score Cards) డౌన్‌లోడ్ చేసుకున అభ్యర్థులు ప్రతి పరీక్ష పేపర్‌కు రూ.500 చెల్లించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ఇంజినీరింగ్, టెక్నాలజీ, ఆర్కిటెక్చర్, సైన్స్ అండ్ హ్యుమానిటీస్‌లలో మాస్టర్స్ ప్రోగ్రామ్‌లు, డాక్టోరల్ ప్రోగ్రామ్‌లు, డైరెక్ట్ డాక్టోరల్ ప్రోగ్రామ్‌లలో ప్రవేశానికి గేట్ స్కోర్‌లను ఉపయోగిస్తారు.








