
ఓవైపు చలితో ప్రజలు గజగజలాడుతుంటే భారత వాతావరణ శాఖ (India Meteorological Department) తాజాగా మరో పిడుగులాంటి వార్త చెప్పింది. రానున్న మూడ్రోజుల పాటు ఆంధ్రప్రదేశ్, తమిళనాడుల్లో వర్షాలు కురిసే అవకాశముందని వెల్లడించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఆదివారం, సోమవారం, మంగళవారాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది.
ఏపీలో మోస్తరు వర్షాలు
ఆదివారం రోజున తమిళనాడు, పుదుచ్చేరిలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు (Tamil Nadu Rains) కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్లోని దక్షిణ కోస్తా, రాయలసీమలోని పలు ప్రాంతాల్లోనూ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వెల్లడించారు. ముఖ్యంగా ఏపీలోని శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, వైఎస్సార్, ప్రకాశం, అన్నమయ్య జిల్లాల్లో మోస్తరు వర్షాలు (AP Rains) కురిసే అవకాశం ఉన్నట్లు ప్రకటించారు.
చలి తీవ్రత పెరిగే అవకాశం
ఇప్పటికే ప్రజలు చలి (AP Weather News)తో గజగజ వణికిపోతున్నారు. ఏపీలోని చాలా జిల్లాల్లో పగటి ఉష్ణోగ్రతలు కూడా పడిపోతున్నాయి. రానున్న నాలుగు రోజులు ఉష్ణోగ్రతలు మరింత పడిపోయి చలి తీవ్రత పెరగనుందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఈ క్రమంలో చిన్న పిల్లలు, వృద్ధులు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. మరోవైపు పొగమంచు కురిసే అవకాశం కూడా ఎక్కువగా ఉండటంతో వేకువజామున ప్రయాణాలు వీలైనంత వరకు చేయకుండా ఉండాలని సూచిస్తున్నారు.