Mana Enadu : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరోసారి వరణుడి భయం పట్టుకుంది. ఓవైపు చలిపులి వణికిస్తుంటే.. మరోవైపు భారీ వర్ష సూచన(AP Rains)తో రాష్ట్ర ప్రజలు జంకుతున్నారు. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీవ్ర వాయుగుండంగా మారి రేపటికి మరింత బలపడి తుఫానుగా మారే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం అధికారులు చెబున్నారు.
తిరుపతిలో భారీ వర్షాలు
ఇది రానున్న రెండు రోజుల్లో ఉత్తర వాయవ్య దిశగా శ్రీలంక తీరాన్ని తాకుతూ తమిళనాడు తీరం వైపు ప్రయాణించే అవకాశం ఉందని, దీని ప్రభావంతో ఏపీలోని రాయలసీమ (Rayalaseema Rains), దక్షిణ కోస్తా, ఉత్తరాంధ్ర జిల్లాలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని విశాఖ వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు. రానున్న 24 గంటలలో నెల్లూరు, తిరుపతిలో భారీ వర్షాలు(Tirupati Rains) కురిసే అవకాశం ఉందని వెల్లడించారు.
ఆ జిల్లాలకు అతిభారీ వర్ష సూచన
రాగల రెండ్రోజుల్లో అన్నమయ్య, ప్రకాశం, చిత్తూరు, నెల్లూరు, తిరుపతి జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు(Andhra Pradesh Rain Alert) కురిసే అవకాశాలున్నాయి. ఈ నెల 30వ తేదీ నుంచి ఉత్తరాంధ్రలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయి. దక్షిణ కోస్తా తీరం వెంబడి గంటకు 35 నుంచి 45 కిలోమీటర్లు వేగంతో గాలుల ప్రభావం ఉంటుంది. మత్య్సకారులు చేపల వేటకు వెళ్లరాదు. రాష్ట్రంలోని అన్ని పోర్టులకు ఒకటో నంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశాం. అని విశాఖ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
నెల్లూరులో భారీ వర్షాలు
మరోవైపు బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో నెల్లూరు జిల్లాలో భారీ వర్షాలు (Nellore Rains) కురుస్తున్నాయి. తెల్లవారుజామున నుంచి కురుస్తున్న వానతో చలి తీవ్రత పెరిగింది. ముత్తుకూరు, వెంకటాచలం, మనుబోలు మండలాల్లో భారీ వర్షం పడింది. మరో మూడు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేయడంతో ప్రజలు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా అధికార యంత్రాంగం ముందస్తు అప్రమత్త చర్యలు చేపడుతోంది.