ఆంధ్రప్రదేశ్(AP), తెలంగాణ(Telangana)లో గత 5 రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు(Rains) కురుస్తున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడటంతో ఈ వర్షాల తీవ్రత పెరిగిందని భారత వాతావరణ శాఖ (IMD) తెలిపింది. ఈ అల్పపీడనం ఒడిశా తీరం దాటే అవకాశం ఉందని అంచనా వేసింది. రానున్న 3-4 రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే ప్రమాదం ఉందని హెచ్చరించింది. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించింది. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అధికారులతో సమావేశాలు నిర్వహించి, సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఏపీ సీఎం చంద్రబాబు(AP CM Chandrababu) వర్చువల్ భేటీ ద్వారా నష్ట నివారణ చర్యలపై చర్చించారు. తెలంగాణ సీఎం రేవంత్(Telangana CM Revanth) అధికారుల సెలవులను రద్దు చేసి, అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ఏపీలో నేడు మోస్తరు నుంచి భారీ వర్షాలు
ఏపీలో ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర, రాయలసీమ(Rayalaseema) ప్రాంతాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. గుంటూరు, విజయవాడ, అమరావతిలో రాకపోకలు స్తంభించాయి. వాగులు, వంకలు పొంగిపొరలడంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. అధికారులు రెడ్ అలర్ట్ జారీ చేసి, అత్యవసరం అయితేనే బయటకు రావాలని సూచించారు. అటు రాయలసీమలోని అనంతపురం, కడప జిల్లాల్లో ఈరోజు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
ఈశాన్య తెలంగాణలో 207 మి.మీ వర్షపాతం
తెలంగాణలో హైదరాబాద్(Hyderabad)తో సహా ఆదిలాబాద్, వరంగల్, నల్గొండ వంటి జిల్లాల్లో వర్షాలు కుమ్మరిస్తున్నాయి. హైదరాబాద్‌లో రోడ్లు నీటితో నిండిపోవడంతో ట్రాఫిక్ సమస్యలు తలెత్తాయి. ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్ జలాశయాలు నిండుకుండలా మారాయి, మూసీ నది గేట్లు తెరిచారు. ఈశాన్య తెలంగాణలో 207 మి.మీ వర్షపాతం నమోదైంది. వాతావరణ శాఖ ఆరెంజ్, ఎల్లో అలర్ట్‌లు జారీ చేసింది. ఈ వర్షాలతో రైతులు పంట నష్టాలపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే పనిలో నిమగ్నమయ్యారు. మరోవైపు పలుజిల్లాల్లో వర్షాల వల్ల పాఠశాలలకు సెలవులు ప్రకటించారు.






