మొన్నటి వరకు ఇండియా ప్రపంచ టెస్టు చాంపియన్ షిప్ కు హాట్ ఫేవరేట్ గా ఉండేది. ప్రస్తుతం ఆ రేసులో నుంచి వెనకబడి పోయింది. ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ (WTC Table) ఫైనల్‌కు మూడోసారి చేరాలనే భారత లక్ష్యం నెరవేరేలా కనిపించడం లేదు. దీనికి కారణం స్వదేశంలో మూడు టెస్టుల్లో క్లీన్ స్వీప్ కావడం ఒక కారణమైతే.. అడిలైడ్ టెస్టులో పింక్ బాల్ తో జరిగిన మ్యాచ్ లో 10 వికెట్ల తేడాతో ఓడిపోవడం మరో కారణం. అడిలైడ్ వేదికగా జరిగిన రెండో టెస్టులో టీమ్‌ఇండియాపై ఆసీస్ (Australia) 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి భారత్ దిగజారింది. ఇప్పటి వరకూ ఆ స్థానంలో ఉన్న ఆసీస్ టాప్‌లోకి దూసుకొచ్చింది. రెండో స్థానంలో దక్షిణాఫ్రికా వచ్చి చేరింది. ఆ తర్వాత స్థానాల్లో శ్రీలంక, ఇంగ్లండ్ ఉండగా.. వచ్చే ఏడాది మార్చి నాటికి టాప్-2లో ఉన్న జట్లు ఫైనల్‌లో తలపడనున్నాయి.
రెండో స్థానానికి దూసుకొచ్చిన సౌతాఫ్రికా..
అడిలైడ్ టెస్టు (Adelaide Test) ముందు వరకు డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో భారత్ 61.11 శాతంతో తొలి స్థానంలో ఉండగా.. ఈ మ్యాచ్ ఓటమితో పాయింట్ల శాతం 57.59 శాతానికి తగ్గి.. మూడో ప్లేస్‌కు పడిపోయింది. 57.69 శాతం నుంచి 60.71 శాతానికి పెరిగి ఆస్ట్రేలియా ఫస్ట్ ప్లేక్ దక్కించుకుంది. కాగా దక్షిణాఫ్రికా 59.26 శాతంతో (South Africa) రెండో స్థానానికి ఎగబాకింది. రాబోయే మూడు టెస్టు మ్యాచులు గెలిస్తేనే భారత్ కు ప్రపంచ టెస్టు చాంపియన్ షిప్ ఫైనల్ చేరే అవకాశం ఉంటుంది. లేకపోతే ఈ సారి ప్రపంచ టెస్టు చాంపియన్ షిప్ సాధించాలన్న కల నెరవేరడం కష్టమేనని అనుకుంటున్నారు. కాగా శ్రీలంక 50 శాతంతో నాలుగో స్థానంలో ఉంది. న్యూజిలాండ్‌పై (44.23) విజయంతో ఇంగ్లండ్ (45.24 శాతం) ఐదో స్థానంలోకి దూసుకొచ్చింది.








