జమ్ముకశ్మీర్ పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడి (Pahalgam Terror Attack) చేసిన పాకిస్థాన్ అంతటితో ఆగకుండా కవ్వింపు చర్యలకు దిగుతోంది. ఉగ్రదాడి అనంతరం దాయాది దేశంతో భారత్ దౌత్య సంబంధాలు తెంపుకోవడంతో పాక్ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఆ దేశ ఆర్మీతో పాటు ఎయిర్‌ఫోర్స్, నేవీని అప్రమత్తం చేసిన దాయాది దేశం.. మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ 24, 25వ తేదీల్లో కరాచీ తీరం వెంబడి ఎకనామిక్ ఎక్ల్సూజివ్ జోన్లో భూతలం నుంచి భూతలం పైకి క్షిపణి ప్రయోగాలు (Pak Missile Test) నిర్వహించాలని నిర్ణయించింది.
పాక్ క్షిపణి ప్రయోగాలు
ఇందుకోసం పాకిస్థాన్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ రెండ్రోజుల్లో 480 కిలోమీటర్ల మేర ఈ క్షిపణి పరీక్ష(Pakistan Missile Test) జరపనున్నట్లు తెలిసింది. ఈ క్రమంలోనే అరేబియా సముద్రంలో నో ఫ్లై జోన్‌గా ప్రకటించడంతో పాటు జాలర్లను వేటకు వెళ్లొద్దని సూచించినట్లు సమాచారం. పాకిస్థాన్ క్షిపణి చర్యల నేపథ్యంలో భారత్ అప్రమత్తమైంది. పాక్ సరిహద్దులో జరిగే కార్యకలాపాలపై పటిష్ఠ నిఘా పెట్టింది.
రావల్పిండికి యుద్ధ విమానాలు
ఇప్పటికే పాక్ యుద్ధ విమానాలు కరాచీ నుంచి ఉత్తరాన ఉన్న వైమానిక స్థావరాలకు బయల్దేరినట్లుగా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. కరాచీలోని దక్షిణ ఎయిర్ కమాండ్ నుంచి లాహోర్, రావల్పిండి సమీపంలోని స్థావరాల వైపుగా పాక్ వైమానిక దళ విమానాలు కదులుతున్నాయి. రావల్పిండిలో పాక్‌కు అత్యంత కీలకమైన నూర్ఖాన్ బేస్ భారత్ సరిహద్దుకు అత్యంత సమీపంలో ఉండటం గమనార్హం.






