ManaEnadu: ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య యుద్ధం(Iran-Israel War)తో పశ్చిమాసియా అట్టుడుకుతోంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం(Central Govt) అప్రమత్తమై కీలక ప్రకటన చేసింది. ఇరాన్‌కు అనవసర ప్రయాణాలు మానుకోవాలని సూచించింది. యుద్ధ ప్రాంతాల్లోని భద్రతా పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తున్నట్లు కేంద్ర విదేశాంగశాఖ(Union Ministry of External Affairs) చెప్పింది. భారత పౌరులు ఇరాన్‌కు అనవసరమైన ప్రయాణాలకు దూరంగా ఉండాలని సూచించింది. అలాగే ప్రస్తుతం ఇరాన్‌లో ఉన్న భారత పౌరులూ అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
దాదాపు 200 బాలిస్టిక్ మిసైళ్లతో దాడి
మరోవైపు ఇరాన్ ఇజ్రాయెల్‌పై దాదాపు 200 బాలిస్టిక్ మిసైళ్ల(Ballistic missiles)తో దాడి చేసింది. ఈ విషయాన్ని ఇరాన్ అధికారిక మీడియా ధ్రువీకరించింది. ఈ దాడుల నుంచి రక్షణ కోసం ప్రజలు ఇప్పటికే బంకర్లలో తలదాచుకున్నారని ఇజ్రాయెల్ రక్షణ శాఖ అధికారులు(Israeli Defense Ministry officials) తెలిపారు. ఇరాన్ మిసైల్ దాడులతో ఇజ్రాయెల్ ముప్పేట దాడిలో చిక్కకున్నట్లైంది. ఇప్పటికే, ఏడాది కాలంగా గాజాలో హమాస్(Hamas)తో పోరాడుతున్న ఇజ్రాయెల్, ఇటీవల లెబనాన్‌లోని హెజ్బొల్లా(Hezbollah)పై దాడులు ముమ్మరం చేసింది. గతవారం హెజ్బొల్లా చీఫ్ హసన నస్రల్లా ఇజ్రాయెల్ దాడుల్లో చనిపోయారు. నస్రల్లా మరణానికి ప్రతీకారం తీర్చుకుంటామని హెచ్చరించిన ఇరాన్ తాజాగా ఇజ్రాయెల్‌పై క్షిపణుల వర్షం కురిపించింది.

ముడి చమురుపై తీవ్ర ప్రభావం
ఇదిలా ఉండగా ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం ప్రభావం కారణంగా ప్రపంచ వ్యాప్తంగా టెన్షన్ పెరిగింది. ఈ యుద్ధం ప్రభావం ముడి చమురు ఉత్పత్తి(Crude oil production) మీదే ఉంటుంది. గ్లోబల్ మార్కెట్(Global Market)లో వరుసగా 3 రోజులుగా క్రూడ్ ఆయిల్ రేట్లు పెరుగుతూనే ఉన్నాయి. బ్యారెల్ బ్రెంట్ క్రూడ్(A Barrel of Brent crude) ధర 1.01 శాతం పెరిగింది, దాదాపు 75 డాలర్ల వద్దకు చేరుకుంది. ప్రస్తుతం,74.65 డాలర్ల వద్ద కదులుతోంది. వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ క్రూడ్ (WTI క్రూడ్) 1.14 శాతం పెరిగి, దాదాపు 71 డాలర్ల స్థాయికి చేరింది. ప్రస్తుతం, బ్యారెల్‌కు 70.90 డాలర్ల వద్ద ఉంది. చమురు దిగుమతులు, పలు రకాల ఉత్పత్తుల ఎగుమతులు, గల్ఫ్ దేశాల్లో కొన్ని లక్షల మంది భారతీయులు పని చేస్తుండటం.. వీటన్నింటిపైనా ప్రభావం కనిపించే అవకాశం ఉందని భారత ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధ ప్రభావం ప్రపంచ దేశాలపై పెను ప్రభావం చూపే అవకాశం ఉంది.








