జమ్మూకశ్మీర్లోని పహల్గాం ఉగ్ర దాడి (Pahalgam Terror Attack) దేశంలో పెను విషాదం నింపింది. ఈ దాడిని ప్రతి ఒక్క భారతీయుడు ఖండిస్తున్నాడు. ఈ ఘటనలో ఇప్పటి వరకు 28మంది పర్యటకులు మరణించారు. పలువురు గాయపడ్డారు. అయితే ఈ దాడిలో పాల్గొన్న ముగ్గురు టెర్రరిస్టుల ఊహాచిత్రాలను (Terrorists Sketches) దర్యాప్తు బృందాలు విడుదల చేశాయి. ఆసిఫ్ ఫౌజి, సులేమాన్ షా, అబు తాలా అనే ముష్కరులుగా వీరిని గుర్తించారు.
ఆ ముగ్గురి ఊహాచిత్రాలు రిలీజ్
మూసా, యూనిస్, ఆసీఫ్ అనే కోడ్ నేమ్లు కూడా ఉన్నట్లు పీటీఐ కథనాలు వెల్లడించాయి. వీరందరూ జమ్మూకశ్మీర్ కేంద్రంగా పనిచేసే ‘ది రెసిస్టెన్స్ ఫ్రంట్ (The Resistance Front)’లో సభ్యులని పేర్కొన్నాయి. ఉగ్రదాడి నుంచి బయటపడిన ప్రత్యక్ష సాక్షులు చెప్పిన వివరాల ప్రకారం ఈ చిత్రాలను రూపొందించారు. పర్యటకుల్లో పురుషులను పక్కకు పంపి.. వారి గుర్తింపు కార్డులు పరిశీలిస్తున్న సమయంలో బాధితులు వారి ముఖాలు చూసినట్లుగా తెలిసింది. ఓ ఉగ్రవాది ఆటోమేటిక్ ఆయుధంతో ఉన్న ఫొటోను కూడా విడుదల చేశారు.
బైసరన్ లోయనే ఎందుకు?
ఇక ఉగ్రవాదులు పర్యటకులపై దాడికి పక్కా వ్యూహంతో బైసరన్ లోయ(Baisaran Valley)నే ఎంచుకున్నట్లు సమాచారం. ఇక్కడ ఎక్కువగా భద్రతా ఏర్పాట్లు ఉండవన్న విషయాన్ని వారు తమ దాడికి అనుకూలంగా వాడుకున్నట్లు తెలిసింది. మరోవైపు పహల్గాం నుంచి ఇక్కడికి రావాలంటే దాదాపు 6.5 కిలోమీటర్లు ప్రయాణించాల్సి ఉంటుంది.. ఒకవేళ దాడి గురించి వెంటనే తెలిసినా.. ఇక్కడికి కాలినడకన లేదా గుర్రాలపై రావాల్సి ఉండటంతో ఇండియన్ ఆర్మీ చేరుకోవడానికి ఆలస్యం అవుతుంది. ఇది ఉగ్రవాదులకు అడ్వాంటేజ్ గా మారింది.






