భారత్‌లో అత్యంత పొడవైన గూడ్స్ రైలు(Goods Train) దేశంలోనే సరకు రవాణా రంగంలో సరికొత్త రికార్డు సృష్టించింది. ‘రుద్రాస్త్ర(Rudrastra)’ పేరుతో ఆసియాలోనే అత్యంత పొడవైన 4.5 కిలోమీటర్ల గూడ్స్ రైలును ఈస్ట్ సెంట్రల్ రైల్వే (ECR) పరిధిలోని పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ డివిజన్(Pandit Deen Dayal Upadhyay Division) విజయవంతంగా నడిపింది. ఈ రైలు ఆగస్టు 7న గంజ్ కవాజా స్టేషన్(Ganj Kawaja Station) నుంచి గర్హ్వా రోడ్(Garhwa Road) వరకు 200 కిలోమీటర్ల దూరాన్ని ఐదు గంటల్లో పూర్తి చేసింది. 354 వ్యాగన్లు, 7 ఇంజిన్లతో రూపొందిన ఈ రైలు సగటున గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించింది.
రైల్వే బృందాన్ని అభినందించిన కేంద్రం మంత్రి
ఆరు ఖాళీ బాక్సన్ ర్యాక్‌లను అనుసంధానించి తయారు చేసిన ఈ రైలు సరకు రవాణా సామర్థ్యాన్ని గణనీయంగా పెంచుతుందని అధికారులు తెలిపారు. ఈ ప్రయోగం వల్ల సమయం, మానవ వనరులు ఆదా కావడమే కాకుండా, రైల్వే ట్రాక్(Railway Tracks)లపై రద్దీ తగ్గి మరిన్ని రైళ్లను నడిపే అవకాశం లభిస్తుంది. కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్(Union Railway Minister Ashwini Vaishnav) ఈ విజయాన్ని ఎక్స్(X)లో పంచుకుని, రైల్వే బృందాన్ని అభినందించారు. ఈ రికార్డు భారత రైల్వే సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటింది. ఈ గూడ్స్ రైళ్లను వేర్వేరుగా నడిపితే.. వాటన్నింటికీ ఆరు వేర్వేరు మార్గాలు, సిబ్బందిని ఏర్పాటు చేయాల్సి ఉంటుందని, రుద్రాస్త్రగా కలిపి నడపడం వల్ల సమయం గణనీయంగా ఆదా అయ్యిందని ఈసీఆర్ పేర్కొంది.
‘Rudrastra’ – Bharat’s longest freight train (4.5 km long) pic.twitter.com/Ufk2MFnpfl
— Ashwini Vaishnaw (@AshwiniVaishnaw) August 8, 2025






