మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల (Maharashtra Assembly Elections) ప్రచారానికి సోమవారం సాయంత్రం తెరపడింది. తుదిరోజు ప్రచారంలో ఊహించినట్టుగానే బారామతిలో పవార్ వెర్సస్ పవార్ (Sharad Pawar Vs Ajit Pawar) హోరాహోరీగా తలబడటం ఎన్నికల ఫలితాలు ఎలా ఉండబోతాయనే ఆసక్తిని మరింత పెంచింది. 288 అసెంబ్లీ నియోజకవర్గాలున్న మహారాష్ట్ర అసెంబ్లీకి ఒకే విడతలో నవంబర్ 20న పోలింగ్ జరుగనుంది. 6 ప్రధాన పార్టీల అగ్రనేతలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని హోరాహోరీగా ప్రచారం చేశాయి.
ఈసారి బరిలో మొత్తం 4,136 మంది
ఈసారి ఎన్నికల్లో పోటీ పడుతున్న ప్రధాన పార్టీల్లో అధికార మహాయుత కూటమిలోని BJP, అజిత్ పవార్ NCP, ఏక్‌నాథ్ షిండే కూటమి, కాంగ్రెస్, శివసేన(UBT), NCP (SP) భాగస్వాములుగా ఉన్న MVA కూటమి ఉన్నాయి. మహాయుతి కూటమిలో భాగంగా BJP 149 సీట్లు, శివసేన 81 సీట్లు, అజిత్ పవార్ NCP 59 నియోజకవర్గాల్లో పోటీ చేస్తు్న్నాయి. MVA కూటమిలో కాంగ్రెస్ 101 సీట్లలో, శివసేన (UBT) 95 స్థానాల్లో, NCP(SP) 86 చోట్ల బరిలో నిలిచాయి. మరోవైపు బహుజన్ సమాజ్ పార్టీ (BSP) 237 స్థానాల్లో తమ అభ్యర్థులను నిలబెట్టగా, AIMIM 17 స్థానాల్లో పోటీ చేస్తోంది. ఈసారి ఎన్నికల్లో 4,136 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు.
ఝార్ఖాండ్‌లో 38 నియోజకవర్గాలకు పోలింగ్
కాగా 2019 ఎన్నికలతో పోల్చుకుంటే ఈసారి 28% అభ్యర్థులు పెరిగారు. వీరిలో 2,086 మంది స్వతంత్ర అభ్యర్థులు ఉన్నారు. 150 స్థానాల్లో రెబల్ అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఈసారి 9 కోట్ల 63 లక్షల 69 వేల పైచిలుకు ఓటర్లు ఉన్నారు. లక్షకుపైగా పోలింగ్ బూత్‌లు ఏర్పాటు చేశారు. 6 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు ఎన్నికల విధుల్లో పాల్గొంటున్నారు. అటు ఝార్ఖాండ్ అసెంబ్లీ ఎన్నికల (Jharkhand Assembly Elections) రెండో విడత ప్రచారానికి సోమవారం సాయంత్రం తెరపడింది. మొత్తం 81 అసెంబ్లీ స్థానాలకు గాను 43 నియోజకవర్గాల్లో తొలి విడత పోలింగ్ నవంబర్ 13న ముగియగా, మిగతా 38 నియోజకవర్గాలకు నవంబర్ 20న పోలింగ్ జరగనుంది. నవంబర్ 23న ఓట్లు లెక్కించి ఫలితాలు(Results) ప్రకటిస్తారు. ఇదే రోజు మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు(Maharashtra Assembly Elections Results) కూడా వెలువడతాయి.






