ఐపీఎం వేలం మొదలు కానుంది. పలువురు స్టార్ ప్లేయర్స్ ఆయా ఫ్రాంచైజీలు కన్నేశాయి. వారిపై ఎన్ని కోట్లైనా కుమ్మరించేందుకు సిద్ధమయ్యాయి. ఫ్రాంచైజీల వద్ద ఎంత ఎక్కవ డబ్బు ఉంటే అంత ఎక్కువ ధర పెట్టి తమకు నచ్చిన ఆటగాళ్లను కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే ఆయా ఫ్రాంచైజీల వద్ద ఎన్ని కోట్లు ఉన్నాయనే విషయంపై ఆసక్తి నెలకొంది.
ఫ్రాంచైజీల్లో అత్యధికంగా పంజాబ్స్ కింగ్స్ వద్ద రూ.110.5 కోట్లు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఇంగ్లాండ్ స్టార్ ప్లేయర్ జోస్ బట్లర్‌తోపాటు మరికొందరిని పంజాబ్ యాజమాన్యం సొంతం చేసుకోవాలని భావిస్తోంది. ఆ తర్వాత బెంగళూరు వద్ద రూ.83 కోట్లు ఉన్నాయి. ఢిల్లీ వద్ద రూ.76.25 కోట్లు, గుజరాత్ టైటాన్స్ వద్ద 69 కోట్లు, లక్నో సూపర్ జెయింట్స్ వద్ద రూ.69 కోట్లు, చెన్నై సూపర్ కింగ్స్ వద్ద రూ.55 కోట్లు, కోల్‌కతా నైట్ రైడర్స్ ఫ్రాంచైజీ వద్ద రూ.51 కోట్లు, ముంబయి ఇండియన్స్ వద్ద రూ.45 కోట్లు, సన్‌రైజర్స్ హైదరాబాద్ వద్ద రూ.45 కోట్లు, అతి తక్కువగా రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీ వద్ద రూ.41 కోట్లు ఉన్నాయి. అన్ని ఫ్రాంచైజీల వద్ద మొత్తం కలిసి రూ.641.5 కోట్లు ఉన్నాయి.
వేలంలో స్టార్ ప్లేయర్స్ వీళ్లే..
ఢిల్లీ జట్టు మాజీ కెప్టెన్ రిషభ్ పంత్ (Rishabh Pant), లక్నో సూపర్ జైంట్స్ మాజీ కెప్టెన్ కేఎల్ రాహుల్‌పై (KL Rahul) యాజమాన్యాలు కన్నేశాయి. బ్యాటింగ్ మాత్రమే కాకుండా వికెట్ కీపింగ్, కెప్టెన్సీ చేసే సామర్థ్యం ఉన్న వీరిపై ఫ్రాంచైజీలు కోట్లు కుమ్మరించే అవకాశం ఉంది. గత సీజన్లో కోల్‌కతా నైట్ రైడర్స్ టీమ్‌కు కప్ అందించిన కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (shreyas iyer) సైతం ఈసారి వేలంలో భారీ ధర దక్కించుకునే అవకాశం ఉంది. పేసర్లు సిరాజ్, అర్షదీప్ సింగ్ తోపాటు విదేశీ ప్లేయర్లు మిచెల్ స్టార్క్, లియామ్ లివింగ్టన్, ఫజల్హక్ ఫరూఖీ, కైల్ మేయర్స్, మిచెల్ సాంట్నర్, సికందర్ రజా మంచి ధర దక్కించుకునే అవకాశం ఉంది.








