
ఇజ్రాయెల్-ఇరాన్ (Iran- Israel) మధ్య 12 రోజులుగా కొనసాగుతున్న యుద్ధానికి ముగిసినట్లే కనిపిస్తోంది. కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వచ్చినట్లు ఇరాన్ ప్రకటించింది. ఈ విషయాన్ని అక్కడి అధికారిక న్యూస్ ఛానెల్ వెల్లడించింది. అయితే ఈ ప్రకటన చేసే చివరి నిమిషం వరకూ ఇజ్రాయెల్‌పై ఇరాన్ దాడులు కొనసాగించడం గమనార్హం. ఇరాన్- ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విరమణ జరగనున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) అంతకుముందే ప్రకటించారు. ఇరుదేశాల మధ్య ఒప్పందానికి తానే మధ్యవర్తిత్వం వహించానని ట్రంప్ చెప్పుకున్నాడు.
ఇరు దేశాలు కాళ్లబేరానికి వచ్చాయన్న ట్రంప్
ఉద్రిక్తతల నేపథ్యంలో ఇరాన్, ఇజ్రాయెల్ దేశాలు ఒకేశారి ‘శాంతి’ అంటూ తన వద్దకు కాళ్లబేరానికి వచ్చాయని ట్రంప్ పేర్కొన్నారు. అక్కడ శాంతి అవసరం ఉందని తాను గుర్తించానన్నారు. ఈ కాల్పుల విరమణ ఒప్పందంలో పశ్చిమాసియాతో పాటు ప్రపంచం కూడా నిజమైన విజయం సాధించిందన్నారు. ఇరుదేశాలు భవిష్యత్తులో ప్రేమ, శాంతి శ్రేయస్సును చూస్తాయని తెలిపారు. అలా కాదని వారు నీతిని, సత్య మార్గాన్ని వదులుకుంటే రానున్న రోజుల్లో మరింత కోల్పోవాల్సి ఉంటుందని హెచ్చరించారు.
కొద్దిసేపటికే దాడులు..
అయితే కాల్పుల విరమణ ఒప్పందం జరిగిందని ట్రంప్ ప్రకటించినప్పటికీ ఇరాన్ దాడులు ఆపలేదు. తెల్లవారుజామున టెల్ అవీవ్‌ను లక్ష్యంగా చేసుకొని ఇరాన్ క్షిపణులు ప్రయోగించింది. ఇరాన్ (Iran) క్షిపణులు తమ దేశం వైపు దూసుకొస్తున్నాయని, ప్రజలంతా సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ఇజ్రాయెల్ మిలిటరీ ప్రజలను హెచ్చరించింది. దక్షిణ, మధ్య ఇజ్రాయెల్ (Israel)ను లక్ష్యంగా చేసుకొని ఈ క్షిపణులు ప్రయోగించినట్లు ఐడీఎఫ్ వెల్లడించింది. జెరూసలెం, బీర్‌షెబా ప్రాంతాల్లో దాడులు జరిగినట్లు తెలుస్తోంది. ఈ దాడుల కారణంగా బీర్‌షెబాలోని ఓ భవనంలో ముగ్గురు మృతిచెందగా, పలువురు గాయపడ్డారు. అనంతరం కాల్పుల విరమణ ప్రకటించింది. మరి ఇరు దేశాల మధ్య దాడులు ఆగుతాయో లేదో? చూడాలి.