
కృత్రిమ మేధ (AI) ప్రపంచాన్ని వేగంగా మార్చేస్తోంది. చాట్‌జీపీటీ(ChatGPT), గూగుల్ జెమినీ(Google Gemini), గ్రోక్(Grok) వంటి ఏఐ టూల్స్(AI Tools) చాలా రంగాల్లో విప్లవాత్మక మార్పులకు దోహదపడుతున్నాయి. దీంతో ఉద్యోగులలో భయాలు కూడా పెరుగుతున్నాయి. ఎందుకంటే ఇప్పటికే ఎన్నో రంగాల్లో ఏఐ వినియోగం పెరగడంతో కొన్ని ఉద్యోగాలు పోయాయి.
ఇటీవలే ప్రముఖ ఐటీ సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) సుమారు 12,000 ఉద్యోగులను తొలగించనున్నట్లు ప్రకటించింది. దీని కారణంగా భవిష్యత్ లో ఉద్యోగ భద్రతపై ఉద్యోగుల్లో మరింత బయలు పెరిగిపోయాయి.
ఈ నేపథ్యంలో, చాట్‌జీపీటీని రూపొందించిన ఓపెన్‌ఏఐ(Open AI) సీఈఓ(CEO) సామ్ ఆల్ట్‌మన్(Sam Altman) తాజాగా కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికాలో జరిగిన ఫెడరల్ రిజర్వ్ బోర్డు కాన్ఫరెన్స్‌లో మాట్లాడిన ఆయన.. “AI సిస్టమ్స్ కస్టమర్ సపోర్ట్(customer support jobs) ఉద్యోగాలను పూర్తిగా భర్తీ చేస్తాయి” అన్నారు. ఇప్పటికే కస్టమర్ సపోర్ట్ కాల్స్‌కు ఏఐ(AI) సమాధానాలు ఇస్తోందని, కస్టమర్ సపోర్ట్ చేయగలిగే ప్రతి పని చేస్తుందని, ఇది తప్పులేం చేయదని, చాలా వేగంగా పని చేయగలదని చెప్పారు.
వైద్యరంగంపై మాట్లాడుతూ.. “చాట్‌జీపీటీ వైద్యులకంటే మెరుగైన రోగ నిర్ధారణ చేయగలదు. కానీ, మానవ వైద్యుల ప్రమేయం లేకుండా ఏఐపై పూర్తిగా ఆధారపడటం సరికాదు” అని అన్నారు.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నేతృత్వంలోని ప్రభుత్వం ఏఐ అభివృద్ధిని వేగవంతం చేస్తోంది. డేటా సెంటర్లు, మౌలిక సదుపాయాల అభివృద్ధి వంటి పథకాలను చేపడుతోంది. ఇది గత బైడెన్ ప్రభుత్వ విధానాలకు భిన్నంగా ఉంది. AI ఎదుగుతున్న కొద్దీ, ఉద్యోగాల భవిష్యత్తుపై ఉన్న ప్రశ్నలు, సాంకేతిక మార్పులపై చర్చలు కొనసాగుతున్నాయి.