హీరోయిన్ కంగనా రనౌత్ (Kangana Ranaut) డైరెక్టర్‌గా మారి తెరకెక్కించిన సినిమా ఎమర్జెన్సీ (Emergency Movie). ఇందిరా గాంధీ ప్రధానిగా ఉన్న కాలంలో విధించిన ఎమర్జెన్సీ, ఆపరేషన్ బ్లూస్టార్ వంటి ఘటనల ఆధారంగా ఈ సినిమాని తెరకెక్కించింది. అయితే ఈ మూవీని మొదలు పెట్టినప్పటి నుంచి అవాంతరాలు ఎదురవుతూనే ఉన్నాయి. ఎప్పుడో రిలీజ్ అవ్వాల్సిన ఈ సినిమా.. సెన్సార్‌తోపాటు పలు కారణాల వల్ల విడుదలకు నోచుకోలేదు. చివరకు అన్ని అడ్డంకులు దాటుకుని జనవరి 17న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ సెన్సార్ బాధలు తప్పేవి..
ఈ సినిమాపై కంగనా రనౌత్ తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ మూవీ తనను ఎంతో ఇబ్బంది పెట్టిందన్నారు. ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. ఎమర్జెన్సీని థియేటర్లలో విడుదల చేయాలనుకోవడం నేను చేసిన పెద్ద తప్పు. ఓటీటీకి వెళ్లుంటే అక్కడ ఇంకా మంచి డీల్ దొరికేది. ఈ సెన్సార్ బాధలు తప్పేవి. అసలు సెన్సార్ బోర్డు నా మూవీలోని పలు సన్నివేశాలను ఎందుకు తీసేయాలనుకుందో అర్థమే కాలేదు. వారు సూచించిన కట్స్ అన్నీ కూడా చరిత్రలో భాగమే. వాటిని తీసేసినా కూడా నా సినిమా బాగుంది. ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేయడం అతి పెద్ద తప్పుగా భావిస్తున్నా’ అని కంగనా అన్నారు.
బడ్జెట్ కోసం కష్టపడాల్సి వచ్చింది..
ఆమె మాట్లాడుతూ.. ‘గతంలో కిస్సా కుర్సీ కా (ఇందిరా గాంధీ, ఆమె కుమారుడు సంజయ్ గాంధీ రాజకీయాలపై వచ్చిన సెటైరికల్ మూవీ) సినిమా వచ్చింది. దీన్ని ఎవరూ చూడలేదు. ఎందుకంటే బ్యాన్ చేశారు. అప్పట్లో ఈ మూవీ ప్రింట్లన్నీ కాల్చేశారు. ఆ మూవీ డైరెక్టర్ అమృత్ నహ్త సూసైడ్ చేసుకున్నాడు. అప్పటినుంచి ఇప్పటివరకు ఇందిరా గాంధీపై (Indira Gandhi) ఏ ఒక్కరూ సినిమా తీసే ధైర్యం చేయలేదు. నాకూ దాదాపు అలాంటి పరిస్థితులే వస్తాయని ఊహించలేదు. స్టూడియో కోసం, బడ్జెట్ కోసం కష్టపడాల్సి వచ్చింది. ఈ సినిమా చూశాక ఇప్పటి జనరేషన్‌కు ఇందిరా గాంధీ మూడుసార్లు ప్రధాని ఎలా అయ్యారో తెలుస్తుంది’ అని పేర్కొన్నారు.







