Mana Enadu : పార్లమెంటు శీతాకాల సమావేశాలు (Parliament Winter Sessions) కొనసాగుతున్నాయి. ఇవాళ్టి సమావేశాల్లో భాగంగా ప్రశ్నోత్తరాలు సాగుతున్నాయి. ఈ క్రమంలోనే గాజా సమస్యపై విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ మాట్లాడారు. గాజా సమస్య(Gaza War)పై ‘ద్విదేశ’ పరిష్కారానికి భారత్ మద్దతు ఇస్తుందని స్పష్టం చేశారు. గాజాపై చేసే ఏ తీర్మానంలో అయినా ఉగ్రవాదం, హమాస్ బందీల అంశం ప్రస్తావించాలని పేర్కొన్నారు. అలా చేయకపోతే అది వాస్తవిక పరిస్థితిని ప్రతిబింబించదని చెప్పారు.
మనది స్వయంగా ఉగ్రవాద బాధిత దేశం
భారత్ స్వయంగా ఉగ్రవాద బాధిత దేశం అని జైశంకర్ (Jai Shankar) అన్నారు. ఉగ్రవాదాన్ని విస్మరించడం, తక్కువగా చూపడం మన దేశ ప్రయోజనాలకు విరుద్ధమని తెలిపారు. ఎటువంటి తీర్మానాన్ని అయినా.. అందులో వాడిన పదాలతో సహా పరిపక్వతతో భారత్ చూస్తుందని.. ఉగ్రవాదాన్ని, ప్రజలను బంధించడాన్ని న్యూదిల్లీ ఖండిస్తుందని స్పష్టం చేశారు. మానవీయ చట్టాలకు, కాల్పుల విరమణకు, హింస ముగింపునకు భారత్ మద్దతు ఇస్తుందని జైశంకర్ స్పష్టం చేశారు.
ఇజ్రాయెల్‌తో మనది బలమైన బంధం
ఇజ్రాయెల్(Israel)లో రక్షణ సహకారానికి సంబంధించి మాట్లాడుతూ.. జాతీయ భద్రతా ప్రయోజనాల విషయంలో ఇజ్రాయెల్‌తో బలమైన బంధం ఉందని తెలిపారు. భారత్ భద్రత ప్రమాదంలో పడిన సందర్భాల్లో అండగా నిలిచిన దేశం అది అని.. మన జాతీయ భద్రతా ప్రయోజనాలను బట్టి ఓ నిర్ణయం తీసుకొంటామని వెల్లడించారు. ఇజ్రాయెల్‌లో UNRAW సంస్థను బ్యాన్ చేయడంపై స్పందిస్తూ.. యూఎన్‌ఆర్‌ఏడబ్ల్యూకు మద్దతు ఇవ్వడంతోపాటు సహకరించాలని భారత్ నిర్ణయించిందని స్పష్టం చేశారు.