బోర్డర్ గవాస్కర్ ట్రోపీలో (Border Gavaskar Trophy) భాగంగా ఆస్ట్రేలియా, భారత్ జట్ల (AUS vs IND) మధ్య గబ్బాలో మూడో టెస్టు మ్యాచ్ జరుగుతోంది. ఫస్ట్ ఇన్నింగ్స్‌లో భారత స్టార్ జస్ప్రీత్ బుమ్రా మినహా బౌలర్లెవరూ పెద్దగా ప్రభావం చూపకపోవడంతో ఆసీస్ 445 రన్స్ సాధించింది. ఆదివారం రెండో రోజు ఆటలో ఆసీస్ కోల్పోయిన 7 వికెట్లలో బుమ్రానే 6 వికెట్లు తీశారు. ఈ సందర్భంగా బుమ్రాపై (Jasprit Bumarh) ప్రశంసించే క్రమంలో వ్యాఖ్యాత, ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ ఇషా గుహా ఓ పదం వాడి విమర్శలు ఎదుర్కొంది.
బుమ్రాను ఇసా గుహా (Isa Guha) కొనియాడే క్రమంలో ‘మోస్ట్ వాల్యుబుల్ ప్రిమేట్’ (primate) అనే పదం వాడింది. అది చింపాజీ క్యారెక్టర్‌తో రూపొందించిన హాలీవుడ్ కామెడీ మూవీ. బుమ్రాను చింపాంజీతో పోల్చిందంటూ ఇసా గుహపై సోషల్ మీడియాలో గుహపై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. దీంతో మూడో రోజు (సోమవారం) ఆట ప్రారంభ సమయంలో బుమ్రాకు ఇసా గుహా క్షమాపణలు తెలిపింది. తనను క్షమించాలని కోరింది.
లైవ్‌లో ఆమె మాట్లాడుతూ.. ‘నిన్న మ్యాచ్ సమయంలో కామెంట్రీ చేస్తూ ఓ పదం వాడాను. కానీ, అది విపరీత అర్థాలకు దారితీసింది. ఎవరినైనా బాధిస్తే క్షమాపణలు చెబుతున్నా. ఇతరుల గౌరవానికి భంగం కలిగించేందుకు ఎప్పుడూ ప్రయత్నించను. నేను మాట్లాడిన మొత్తం మాటలు వింటే.. బుమ్రాపై అత్యుత్తమ ప్రశంసలు కురిపించానని మీకే అర్ధమవుతుంది. భారత గొప్ప ఆటగాళ్లను ఎప్పుడూ తక్కువ చేయను. బుమ్రా విషయంలో అతడు సాధించిన అద్భుతాలను ప్రశంసించే క్రమంలో పొరపాటు పదం వాడినట్లు అనుకుంటున్నా. అందుకు మనస్ఫూర్తిగా క్షమాపణలు చెబుతున్నా. దక్షిణ ఆసియా వారసత్వం కలిగిన వ్యక్తిగా నేను ఎలాంటి దురుద్దేశ వ్యాఖ్యలు చేయలేదని అక్కడి అభిమానులు భావిస్తారని అనుకుంటా’ అని గుహా (Isa Guha) అన్నారు.








