Mana Enadu : అమెరికా అధ్యక్షుడు జో బైడెన్(Joe Biden) తాను అధ్యక్ష పీఠం దిగబోయే ముందు సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆయన కుమారుడు హంటర్ బైడెన్‌కు కేసుల నుంచి పూర్తి ఉపశమనం కల్పించారు. అక్రమంగా ఆయుధం కొనుగోలు సహా రెండు క్రిమినల్ కేసుల్లో హంటర్ (Joe Biden pardons son Hunter)కు క్షమాభిక్ష ప్రసాదించారు. తన కుమారుడిపై కేసులు రాజకీయ ప్రేరేపితమైనవి అని జో బైడెన్ ఆరోపించారు.
ఇక జరిగింది చాలు
‘‘అమెరికన్లను ఓ నిజం చెప్పాలి. న్యాయశాఖ తీసుకునే నిర్ణయాల్లో జోక్యం చేసుకోబోనని అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన మొదటిరోజే చెప్పాను. ఆ మాటకు నేను కట్టుబడి ఉన్నా. నా కుమారుడు హంటర్ (Hunter Biden)ను అన్యాయంగా విచారించే సమయంలోనూ ఈ సూత్రానికి కట్టుబడే నేను ఏం చేయలేక చూస్తుండిపోయాను. రాజకీయ కుట్రలో భాగంగానే అతడిపై కేసులు పెట్టారు. కానీ ఇంకా మౌనంగా ఉండలేను. ఇక జరిగింది చాలు. ఈ కేసుల్లో అతడికి క్షమాభిక్ష ప్రసాదించాలని డిసైడ్ అయ్యాను. ఒక తండ్రిగా, అధ్యక్షుడిగా ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నానో అమెరికన్లు అర్థం చేసుకుంటారనుకుంటున్నాను’’ అని బైడెన్ పేర్కొన్నారు.
బైడెన్ చేసింది న్యాయ విఘాతం
మరోవైపు జో బైడెన్ తన కుమారుడు హంటర్ బైడెన్‌కు క్షమాభిక్ష పెట్టడాన్ని అగ్రరాజ్యానికి కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) తప్పుబట్టారు. ఇది పూర్తిగా న్యాయ విరుద్ధమని అన్నారు. బైడెన్ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారంటూ ధ్వజమెత్తారు. హంటర్‌కు క్షమాభిక్ష ప్రసాదించినట్లే ఏళ్లుగా జైళ్లలో మగ్గుతున్న జే-6 (జనవరి 6న క్యాపిటల్ హిల్‌లో ట్రంప్ తరఫున అల్లర్లలో పాల్గొన్నవారు) బందీలకు ఎందుకు ఉపశమనం కల్పించలేదని డొనాల్డ్ ట్రంప్ నిలదీశారు.






