భారత్‌తో జరుగుతున్న బోర్డర్ గవాస్కర్ ట్రోపీ (Border-Gavaskar Trophy 2024–25) మొదటి టెస్టులో దారుణ ఓటమితో భంగపడిన ఆసీస్ జట్టుకు రెండో టెస్ట్‌కు ముందు మరో గట్టి షాక్ తగిలింది. గాయం కారణంగా ఆ జట్టు నుంచి కీలక ప్లేయర్ బయటకు వెళ్లిపోయాడు. స్టార్ సీమర్ జోష్ హేజల్‌వుడ్ (Josh Hazlewood) సెకండ్ టెస్ట్‌కు దూరమయ్యాడు. నడుం కింది భాగంలో నొప్పి రావడంతో హేజల్‌వుడ్ ఈ విషయాన్ని మేనేజ్మెంట్ దృష్టికి తీసుకెళ్లాడు . అతడిని పరీక్షించిన మెడికల్ టీమ్ రెస్ట్ అవసరమని సూచించినట్లు క్రికెట్ ఆస్ట్రేలియా తెలిపింది.
పెర్త్ టెస్ట్‌లో ఆసీస్ బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో విఫలమై ఓటమి పాలైంది. ఆ మ్యాచ్‌లో 5 వికెట్లు తీసిన హేజల్‌వుడ్ మిగతా బౌలర్ల కంటే మెరుగ్గా రాణించాడు. అలాంటి ప్లేయర్ జట్టుకు దూరమవడం ఆసీస్‌కు భారీ ఎదురుదెబ్బ అనే చెప్పాలి. పరిస్థితి మెరుగవకపోతే సిరీస్ మొత్తానికీ అతడు దూరమయ్యే ప్రమాదం ఉందని సమాచారం. దీంతో కమిన్స్ సేన ఇబ్బందుల్లో పడిపోయింది. హేజల్‌వుడ్ స్థానంలో యంగ్ పేసర్ స్కాట్ బోలాండ్‌ను సెలెక్ట్ చేసింది టీమ్ మేనేజ్మెంట్. అతడితో పాటు సీన్ అబాట్, డొగ్గెట్‌ను కూడా ఎంపిక చేసింది. అయితే ఇప్పటికే ‘ప్రైమ్ మినిస్టర్స్ ఎలెవన్’ టీమ్‌లో ఉన్న బోలాండ్.. వార్మప్ మ్యాచ్‌లో నిరూపించుకుంటే పింక్ టెస్ట్ తుది జట్టులో స్థానం దక్కించుకునే అవకాశాలున్నాయి.
భారత్ (Team India), ఆస్ట్రేలియా (Team Australia) ప్రతిష్ఠాత్మకంగా భావించే బోర్డర్ గవాస్కర్ ట్రోపీ మొదటి టెస్టులో భారత్ రెండు విభాగాల్లో రాణించి భారీ విజయాన్ని నమోదు చేసింది. ఆసీస్‌ను 295 పరుగుల భారీ తేడాతో చిత్తుచేసింది. తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 150 పరుగులే చేసిన టీమిండియా.. ఈ తర్వాత పుంజుకొని 104 రన్స్‌కే కంగారూ జట్టును కట్టడి చేసింది. కెప్టెన్ బుమ్రా తన పేస్ బౌలింగ్‌తో ఆస్ట్రేలియా బ్యాటర్లను బెంబేలెత్తించి 5 వికెట్లు తీశాడు. సెకండ్ ఇన్నింగ్స్‌లో జైస్వాల్, విరాట్ కోహ్లీ సెంచరీలు చేయడంతో భారత్ 487 రన్స్ చేసి డిక్లేర్ చేసింది. ఆ తర్వాత బుమ్రా, సిరాజ్,హర్షిత్ రాణా చెలరేగడంతో కంగారూ జట్టు 238 రన్స్ చేసి ఆలౌట్ అవడంతో భారత్ 295 రన్స్ తేడాతో విజయం సాధించింది. రెండో టెస్టు డిసెంబర్ 6 నుంచి అడిలైడ్‌లో జరగనుంది.








