గత శుక్రవారం వరల్డ్ వైడ్ గ్రాండ్ రిలీజ్ అయిన కన్నప్ప(Kannappa) మూవీ, అద్భుతమైన కలెక్షన్లతో దూసుకుపోతోంది. తొలి మూడు రోజుల వసూళ్లపై సోషల్ మీడియాలో భారీ చర్చ జరుగుతోంది. ట్రేడ్ వర్గాల నివేదికల ప్రకారం, మంచు విష్ణు(Vishnu manchu) డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన ‘కన్నప్ప’, భారీ సక్సెస్ సాధించినట్లే అని తెలుస్తోంది. ఈ సినిమా విజయం పట్ల మంచు విష్ణు, మోహన్ బాబు(Mohan Babu)లతో పాటు కన్నప్ప టీం అంతా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తోంది.
ఈ నేపథ్యంలో మీడియాతో ముచ్చటిస్తున్న మంచు విష్ణు పలు ఆసక్తికర విషయాలు ప్రసారవిస్తున్నారు. వాస్తవానికి ఈ చిత్రాన్ని ఏప్రిల్‌లోనే విడుదల చేయాల్సి ఉందని.. రామ్ గోపాల్ వర్మ(Ram Gopal varma) అన్న ఒక్క మాటతో వాయిదా వేయడం జరిగిందని ఆయన తెలిపారు. ‘ఇన్ని జాగ్రత్తలు తీసుకున్న విష్ణు, గ్రాఫిక్స్ విషయంలో అంత తేలికగా వదిలేస్తాడా?’ అని అనడంతో ఆ మాట తనను ఆలోచింపజేసిందని, వెంటనే సినిమా విడుదలను వాయిదా వేసి, వీఎఫ్‌ఎక్స్‌పై మరింత దృష్టి పెట్టి ఈ రేంజ్ అవుట్ ఫుట్ ఇచ్చామని విష్ణు చెప్పారు.
విష్ణు అంకితభావంతో పాటు భారీ బడ్జెట్ కేటాయించి అత్యాధునిక VFX జోడించడం, అగ్ర తారల సమష్టి కృషి ‘కన్నప్ప’ విజయంలో కీలక పాత్ర పోషించాయని చెప్పుకోవచ్చు. ఈ చిత్రం మంచు విష్ణు కెరీర్‌లోనే ఓ మైలురాయిగా నిలుస్తుందని, భక్తిరస చిత్రాలకు ఇది కొత్త మార్గాన్ని సుగమం చేస్తుందని సినీ వర్గాలు అంటున్నాయి. ఈ చిత్రంలో ప్రభాస్ రోల్ మేజర్ అట్రాక్షన్ కాగా, క్లైమాక్స్ లో మంచు విష్ణు నటనకు మంచి మార్కులు పడ్డాయి.
ఈ చిత్రంలో ప్రభాస్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్, శరవనన్ వంటి అగ్ర తారలు ముఖ్య పాత్రల్లో నటించడంతో సినిమాపై భారీ స్థాయిలో ఆసక్తి ఏర్పడింది. విడుదల తర్వాత ఆ స్టార్స్ మూవీ విజయంలో కీలకంగా మారారు.






