తెలంగాణ హైకోర్టు(Telangana High Court) నూతన ప్రధాన న్యాయమూర్తి(Chief Justice)గా జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్(Justice Aparesh Kumar Singh) నియమితులయ్యారు. ఈ నియామకానికి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము(President Draupadi Murmu) ఆమోదం తెలిపారు. జస్టిస్ సింగ్ గతంలో త్రిపుర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా 2023 ఏప్రిల్ 17 నుంచి సేవలందించారు. సుప్రీంకోర్టు కొలీజియం(Supreme Court Collegium) సిఫార్సులను రాష్ట్రపతి ఆమోదించడంతో కేంద్ర న్యాయశాఖ బదిలీ ఉత్తర్వులు జారీ చేసింది.
పట్నా హైకోర్టులో న్యాయవాదిగా వృత్తి ప్రారంభం
కాగా 1965 జూలై 7న జన్మించిన జస్టిస్ సింగ్, ఢిల్లీ విశ్వవిద్యాలయం నుంచి బీఏ ఆనర్స్, LLB పట్టాలు పొందారు. 1990లో పట్నా హైకోర్టులో న్యాయవాదిగా తన వృత్తిని ప్రారంభించారు. 2001లో ఝార్ఖండ్ హైకోర్టు(Jharkhand High Court) ఏర్పాటైన తర్వాత అక్కడికి బదిలీ అయ్యారు. 2012లో ఝార్ఖండ్ హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులై, 2021లో ఝార్ఖండ్ రాష్ట్ర లీగల్ సర్వీసెస్ అథారిటీ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌గా సేవలందించారు.
#Judicial appointments #Indian New #Telangana High Court CJ is Justice Aparesh Kumar Singh pic.twitter.com/XAMyrUT56E
— PChari (@PChari03) July 14, 2025
ఈ నియామకంతో జస్టిస్ సుజోయ్ పాల్ కలకత్తా హైకోర్టుకు బదిలీ అయ్యారు. జస్టిస్ సింగ్ నాయకత్వంలో తెలంగాణ హైకోర్టు న్యాయవ్యవస్థలో మరింత సమర్థత, పారదర్శకతను తీసుకొస్తుందని ప్రజలు ఆశిస్తున్నారు. మరోవైపు మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ బట్టు దేవానంద్(Justice Battu Devanand) ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు బదిలీ అయ్యారు. ఆయన గతంలోనూ ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా పని చేశారు. వీరితోపాటు పలువురు న్యాయమూర్తులను బదిలీ చేస్తూ రాష్ట్రపతి ఆమోదం తెలిపారు.






