భారత్లో మళ్లీ కరోనా (Covid 19) కలకలం రేపుతోంది. ముఖ్యంగా కేరళలో విజృంభిస్తోంది. ఒక్క మే నెలలోనే కేరళలో 182 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. దీంతో కేరళ ఆరోగ్య శాఖ అలర్ట్ అయింది. ఆగ్నేయాసియా దేశాల్లో పెరుగుతున్న కేసుల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కేరళ ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ (Veena George)సూచించారు. కరోనా లక్షణాలు ఉన్నవారికి పరీక్షలు పెంచాలన్నారు.
ఈ నెలలోనే 182 కేసులు
కేరళలో (Covid cases in Kerala) నమోదైన 182 కరోనా కేసుల్లో అత్యధికంగా కొట్టాయం జిల్లాలో 57 కేసులు, ఎర్నాకులంలో 34 కేసులు, తిరువనంతపురంలో 30 కేసులు నమోదయ్యాయి. మిగిలిన కేసులు ఇతర జిల్లాల్లో వెలుగుచూసినట్లు తెలిపారు. కేరళలో కొవిడ్ పరిస్థితిని సమీక్షించడానికి ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్తో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించినట్లు వీణాజార్జ్ వెల్లడించారు. లక్షణాలు ఉన్నవారికి కొవిడ్ నిర్ధారణ టెస్ట్‌లు పెంచనున్నట్లు తెలిపారు. ఆస్పత్రులలో ఆర్టీపీసీఆర్ కిట్లు, భద్రతా పరికరాల లభ్యతను నిర్ధారించుకోవాలని సూచించారు.
తప్పనిసరిగా మాస్క్ ధరించాలి
జలుబు, గొంతు నొప్పి, దగ్గు, శ్వాస ఆడకపోవడం వంటి లక్షణాలు ఉన్నవారు తప్పనిసరిగా మాస్క్‌లు ధరించాలని మంత్రి వీణా జార్జ్ ఆదేశించారు. వృద్ధులు, గర్భిణీలు, తీవ్రమైన అనారోగ్యాలతో బాధపడుతున్నవారు బహిరంగ ప్రదేశాల్లో, ప్రయాణాల్లో మాస్క్‌లు ధరించడం మంచిదన్నారు. అనవసరంగా ఆస్పత్రులకు వెళ్లడాన్ని నివారించాలని, ఎప్పటికప్పుడు సబ్బుతో చేతులు కడుక్కోవాలని సూచించారు. హాస్పిటల్స్లో మాస్క్‌లు తప్పనిసరి అని, ఆరోగ్య కార్యకర్తలు అన్ని వేళలా ధరించాలని పేర్కొన్నారు. ప్రస్తుతం కొవిడ్ వేరియంట్లు వేగంగా వ్యాపిస్తున్నప్పటికీ తీవ్రత అధికంగా లేదని, కానీ వైరస్ వ్యాప్తి చెందకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.






