హైదరాబాద్ ఫార్ములా ఈ రేసు (Formula E Race Case) వ్యవహారం కీలక మలుపులు తిరుగుతోంది. ఈ కేసులో ఏసీబీ, ఈడీ దర్యాప్తు ముమ్మరం చేశాయి. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్(KTR)కు నోటీసులు జారీ చేశాయి. ఈనెల 9వ తేదీన విచారణకు రావాలని ఏసీబీ అధికారులు నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేటీఆర్ తాజాగా తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు.
హైకోర్టులో కేటీఆర్ పిటిషన్
ఏసీబీ విచారణ నేపథ్యంలో కేటీఆర్ హైకోర్టులో (KTR Petition in HC) లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. విచారణకు తనతో పాటు న్యాయవాదిని అనుమతించాలని ఆ పిటిషన్ లో పేర్కొన్నారు. ఈ వ్యాజ్యంపై విచారణ చేపట్టేందుకు కోర్టు అనుమతించింది. ఈ నేపథ్యంలో మధ్యాహ్నం వరకు దీనిపై ఉన్నత న్యాయస్థానం తన నిర్ణయాన్ని వెల్లడించనుంది. ఇటీవలే ఏసీబీ విచారణకు హాజరయ్యేందుకు వచ్చిన కేటీఆర్ (KTR ACB Case)ను పోలీసులు అడ్డుకుని ఆయన లీగల్ టీమ్ కు అనుమతి లేదని చెప్పిన విషయం తెలిసిందే.
రేపు విచారణకు రండి
ఈ నేపథ్యంలో లాయర్ ఉంటే విచారించడంలో సమస్య ఏంటంటూ అధికారులను కేటీఆర్ ప్రశ్నించారు. ఈ క్రమంలో అక్కడి నుంచి వెనుదిరిగారు. అయితే విచారణకు హాజరు కావాలంటూ ఏసీబీ మరోసారి కేటీఆర్ కు నోటీసులు ఇచ్చింది. ఈనెల 9వ తేదీన విచారణకు రావాలని అందులో పేర్కొంది. ఈ క్రమంలోనే కేటీఆర్ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు.







