Mana Enadu : మందుబాబులకు ఏపీ సర్కార్ (AP Govt) కిక్కిచ్చే న్యూస్ చెప్పింది. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ (New Year 2025) సందర్భంగా డిసెంబరు 31వ తేదీ, జనవరి 1వ తేదీన అర్ధరాత్రి ఒంటిగంట దాకా మద్యం విక్రయాలు జరిపేందుకు అనుమతినిచ్చింది. ఈ మేరకు తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీలోని అన్ని బార్ అండ్ రెస్టారెంట్లు, ఈవెంట్లు, టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ హోటళ్లలో అర్ధరాత్రి ఒంటి గంట వరకు మద్యం అమ్ముకోవచ్చని ఉత్తర్వుల్లో పేర్కొంది.
అందుకే అర్ధరాత్రి వరకు అమ్మకాలు
అదే విధంగా వైన్ షాపులను రాత్రి 12 గంటల దాకా తెరిచి ఉంచవచ్చని ఉత్తర్వుల్లో రాష్ట్ర సర్కార్ పేర్కొంది. సాధారణంగా ప్రతి రోజు రాత్రి 10 గంటల వరకు మాత్రమే మద్యం అమ్మకాలు (Liquor Sales) జరుగుతాయన్న విషయం తెలిసిందే. కానీ న్యూ ఇయర్ వేడుకల వేళ మద్యం అమ్మకాలు ఎక్కువగా జరుగుతాయని భావించిన సర్కార్.. డిసెంబర్ 31వ తేదీతో పాటు జనవరి 1వ తేదీన అర్ధరాత్రి ఒంటి గంట వరకు మద్యం అమ్మకాలకు అనుమతించింది.
పోలీసుల వార్నింగ్
మరోవైపు రాష్ట్రంలో న్యూ ఇయర్ వేడుకలకు (New Year in AP 2025) ప్రజలు సిద్ధమవుతున్నారు. వేడుకల దృష్ట్యా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు పోలీసులు నిబంధనలు జారీ చేశారు. అర్ధరాత్రి రోడ్లపై రెచ్చిపోయి డ్రైవింగ్ చేస్తే కఠిన చర్యలు తప్పవని పోలీసులు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఇక హోటళ్లు, క్లబ్బులు, బార్ అండ్ రెస్టారెంట్ నిర్వాహకులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. డ్రోన్ కెమెరాల చిత్రీకరణతో పాటు ఎక్కువ మంది సిబ్బందితో, అన్ని చోట్లా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించనున్నారు.








