Mana Enadu : వాళ్లవి రెక్కాడితే కానీ డొక్కాడని కుటుంబాలు. రోజువారి కూలీ పని చేసుకునే వారు కొందరైతే.. రైతుల నుంచి కూరగాయలు కాస్త తక్కువ ధరకు విక్రయించి.. వాటిని వినియోగదారులకు అమ్ముకునే వారు మరికొందరు. ఎప్పటిలాగే వారు రోడ్డుపై కూరగాయలు విక్రయిస్తున్నారు. ఇవాళ మార్కెట్ కావడంతో కాస్త గిట్టుబాటు అవుతుందని.. ఎంతో సంతోషంగా వచ్చారు. కానీ లారీ రూపంలో మృత్యువు వారిని కబళిస్తుందని ఊహించలేకపోయారు.
లారీ రూపంలో దూసుకొచ్చిన మృత్యువు
కిక్కిరిసిన జాతీయ రహదారిపై కూరగాయలు విక్రయిస్తుండగా లారీ రూపంలో వారిపైకి మృత్యువు (Chevella Lorry Accident) దూసుకొచ్చింది. ఈ ఘటనలో దాదాపు 10 మంది కూరగాయలు విక్రయించే వారు మరణించినట్లు సమాచారం. ఈ దుర్ఘటన రంగారెడ్డి జిల్లాలో సోమవారం సాయంత్రం చోటు చేసుకుంది. చేవెళ్ల మండలం ఆలూరు స్టేజి వద్ద లారీ సృష్టించిన బీభత్సానికి పదుల సంఖ్యలో ప్రాణాలు పోయాయి.
వ్యాపారులపైకి దూసుకెళ్లిన లారీ
హైదరాబాద్ -బీజాపుర్ రహదారి వద్ద దాదాపు 50 మంది కూరగాయలు విక్రయిస్తున్నారు. అటుగా వచ్చిన లారీ (Lorry Rammed Into Vegetable Market) అకస్మాత్తుగా వారిపైకి దూసుకెళ్లింది. ఒక్కసారిగా తమవైపు దూసుకొస్తున్న లారీని చూసి వ్యాపారులు భయంతో పరుగులు తీశారు. అప్పటికే దాదాపు పది మందిని ఆ లారీ పొట్టనపెట్టుకుంది. వ్యాపారులపైకి దూసుకెళ్లి చెట్టును ఢీ కొని లారీ ఆగిపోయింది.
పది మంది మృతి
లారీ డ్రైవర్ మాత్రం క్యాబిన్‌లో ఇరుక్కుపోయాడు. లారీ వేగంగా ఢీ కొట్టడంతో ఆ చెట్టు నేలకూలింది. ఈ ఘటన గురించి సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకున్నారు. సహాయక చర్యలు చేపట్టి క్షతగాత్రులను సమీప ఆస్పత్రికి తరలించారు. ఇప్పటివరకు ఈ ప్రమాదంలో పది మంది వరకు మరణించినట్లుగా భావిస్తున్నట్లు తెలిపారు. ఈ ఘటనతో హైదరాబాద్- బీజాపుర్ (Hyderabad-bijapur) రహదారిపై భీతావహ వాతావరణం నెలకొంది. కాసేపు ట్రాఫిక్ జామ్ కావడంతో అధికారులు రంగంలోకి దిగి ట్రాఫిక్ క్లియర్ చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.