మహా కుంభమేళా(Mahakumbha Mela) ప్రపంచంలోనే అతిపెద్ద అధ్యాత్మిక కార్యక్రమం. 12 ఏళ్లకు ఒకసారి వచ్చే మహత్తర వేడుక. కోట్లాది మంది తరలివచ్చే బృహత్తర ఆధ్యాత్మిక ఉత్సవం. ఈ మహాత్తర కార్యక్రమం రేపటి (జనవరి 13) నుంచి శివరాత్రి (ఫిబ్రవరి 26) దాకా 45 రోజుల పాటు కొనసాగనుంది. ఇక ఈ మహాకుంభమేళాలో త్రివేణీ సంగమం(Triveni Sangam)లో పవిత్ర స్నానం, గంగా హారతి, కల్పవాస్, దైవపూజ, దీపదానం, పంచక్రోశ్ పరిక్రమ, సంకీర్తన, భజన,యోగా, మెడిటేషన్, అఖాడాల ప్రదర్శన వంటి ఉండనున్నాయి. మరోవైపు ఉత్తర ప్రదేశ్(Uttar Pradesh)లోని ప్రయాగ్‌రాజ్(Prayagraj)లో జరిగే ఈ మహా కుంభమేళాకు ప్రభుత్వం ముమ్మర ఏర్పాట్లు చేసింది.
భారీ ఏర్పాట్లు.. పటిష్ఠి నిఘా
త్రివేణీ సంగమానికి రెండు వైపులా 4 వేల హెక్టార్లలో సకల సౌకర్యాలు ఉండేలా శ్రద్ధ తీసుకుంది. భక్తులు(Devotees), యాత్రికులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా దాదాపు 2 లక్షల టెంట్లు ఏర్పాటు చేసింది. వీటితోపాటు 1.5 లక్షల తాత్కాలిక మరుగుదొడ్లు నిర్మించింది. భక్తుల భద్రతకు డోన్ల(Drones)ను వాడనుంది. AI CC కెమెరాల సహాకారంతో నిరంతర నిఘాకు చర్యలు చేపడుతోంది.ఈ మహా కుంభమేళాకు తరలివచ్చే భక్తుల కోసం రైల్వేశాఖ(Indian Railways) దాదాపు 3వేల ప్రత్యేక రైళ్ల(Special Trains)తోపాటు మొత్తం 13వేల ట్రైన్స్ నడుపుతోంది. సుమారు 2 కోట్ల మంది ఈ ట్రైన్స్ ద్వారా వచ్చే అవకాశం ఉంది. అంతేకాదు తొమ్మిది కీలకమైన రైల్వే స్టేషన్లలో 560 టికెట్ కౌంటర్లను ఏర్పాటు చేశారు.
అందుబాటులో స్పెషల్ బస్సులు.. విమానాలు
కుంభమేళాకు వెళ్లే భక్తుల కోసం వివిధ విమానయాన సంస్థలు(Airways) విమానాలు నడుపుతున్నాయి. ఢిల్లీ, ముంబై, బెంగళూరు, బిలాస్‌పూర్, HYD, రాయ్‌పూర్, లక్నో, భువనేశ్వర్, కోల్‌కతా, డెహ్రాడూన్, చండీగఢ్ వంటి ప్రధాన నగరాల మధ్య ప్రయాగ్‌రాజ్(Prayagraj)కు నేరుగా విమానాల ద్వారా పెద్ద ఎత్తున తీర్థయాత్రలు సాగేందుకు ఏర్పాట్లు చేశారు. అలాగే UP ప్రభుత్వం రాష్ట్రంలోని మొత్తం 75 జిల్లాల నుంచి ప్రయాగ్‌రాజ్‌కు 7,550 బస్సులను నడుపుతోంది. దీంతో పాటు అదనంగా, ఈవెంట్ సైట్‌కి సులభంగా యాక్సెస్ కోసం 550 కొత్త షటిల్ బస్సులు(Busses) ప్రయాగ్‌రాజ్ సరిహద్దుల వద్ద అందుబాటులో ఉంటాయి. కాగా ఇప్పటికే కుంభమేళాకు కౌంట్ డౌన్ మొదలైంది. ఈ సారి నిర్వహించే వేడుక ఇంతకుముందు జరిగిన కుంభమేళాలన్నింటిలోకెళ్లా ఉత్తమమైనదిగా నిలుస్తుందని అధికారులు భావిస్తున్నారు.






