Mana Enadu : పంజాబ్ రాష్ట్రంలోని అమృత్సర్ స్వర్ణదేవాలయం (Golden Temple) ద్వారం కాల్పులు కలకలం సృష్టించాయి. పంజాబ్ మాజీ డిప్యూటీ సీఎం, అకాలీదళ్ అధ్యక్షుడు సుఖ్బీర్ సింగ్ బాదల్(Sukhbir Singh Badal)పై ఆలయ పరిసరాల్లో హత్యాయత్నం జరిగింది. ఆయనపై అతి సమీపం నుంచి ఓ దుండగుడు కాల్పులు జరపగా.. తుపాకీ గురితప్పింది. దీంతో సుఖ్బీర్ సింగ్ ప్రాణాలతో తప్పించుకున్నారు. అయితే నిందితుడు కాల్పులు జరపడానికి గల కారణాలు తెలియరాలేదు.
ఇదీ జరిగింది?
శిక్షలో భాగంగా స్వర్ణ దేవాలయ ప్రవేశ ద్వారం వద్ద సుఖ్బీర్ చక్రాల కుర్చీపై కూర్చొని సేవాదార్ (కాపలాదారుడు)గా ఉన్నారు. ఓ వృద్ధుడు ఆయన దగ్గరకు వచ్చి.. కొన్ని అడుగుల దూరంలోనే ఉన్న అతడు ప్యాంట్ జేబులోంచి తుపాకీ తీసి సుఖ్‌బీర్‌పై కాల్పులు (Sukhbir Badal Firing) జరిపాడు. గమనించిన బాదల్ వ్యక్తిగత సిబ్బంది వెంటనే వృద్ధుడిని అడ్డుకున్నారు.
ఉగ్ర ముఠాతో నిందితుడికి సంబంధాలు
ఈ ఘటనలో సుఖ్బీర్ బాదల్‌కు ఎలాంటి హాని జరగలేదని అధికారులు తెలిపారు. భద్రతా సిబ్బంది అతడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. నిందితుడిని నారైన్ సింగ్ చౌరాగా గుర్తించారు. అతడు గతంలో బబ్బర్ ఖల్సా ఇంటర్నేషనల్ అనే ఉగ్ర ముఠాలో పని చేసినట్లు పలు మీడియాల్లో కథనాలు పేర్కొన్నాయి.
శిక్ష సమయంలో కాల్పులు
శిరోమణి అకాలీదళ్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో సుఖ్బీర్ సింగ్ బాదల్ మతపరమైన తప్పిదాలకు పాల్పడినట్లు ఆరోపణలొచ్చాయి. 2007-17 మధ్య కాలంలో పార్టీతో పాటు వారి ప్రభుత్వం రాజకీయంగా తప్పుడు నిర్ణయాలు తీసుకున్నట్లు అకాల్ తఖ్త్(Akal Thakth) నిర్ధరించి పార్టీ చీఫ్ సుఖ్బీర్ను దోషిగా తేల్చి సేవకుడిగా అమృత్‌సర్‌లోని స్వర్ణదేవాలయంలో పాత్రలు, బూట్లు శుభ్రం చేయాలని ఆదేశించింది. దీంతో ఆయన మంగళవారం నుంచి ఈ శిక్షను అనుభవిస్తున్న సమయంలో బుధవారం రోజున ఈ కాల్పుల ఘటన చోటుచేసుకుంది.






