
మంచు మనోజ్(Manchu Manoj) మరియు మంచు విష్ణు(Manchu Vishnu) మధ్య జరుగుతున్న విభేదాలు అందరికీ తెలిసిందే. సోషల్ మీడియా వేదికగా మనోజ్ తన అన్న విష్ణుపై విమర్శలు చేస్తూ పలు మార్లు ఘాటైన వ్యాఖ్యలు చేశాడు. అంతేకాదు, విష్ణు ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న కన్నప్ప(Kannappa) సినిమా విషయంలోనూ ట్రోలింగ్ చేసిన సందర్భాలున్నాయి.
అయితే తాజాగా ఈ వివాదాన్ని పక్కనపెట్టి కన్నప్ప సినిమాపై స్పందించాడు మనోజ్. జూన్ 27న విడుదల కాబోతున్న కన్నప్ప సినిమా కోసం ఆయన స్పెషల్ ట్వీట్ చేశాడు. ఈ సినిమా కోసం తమ నాన్న మోహన్ బాబు గారు, టీమ్ ఎంతగానో కష్టపడిందని పేర్కొంటూ… ‘‘ఈ సినిమా పెద్ద హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’’ అంటూ ట్వీట్ చేశాడు.
ముఖ్యంగా విష్ణు పిల్లలు అరి, వివి, అవ్రామ్‌ల ఫోటోలు షేర్ చేస్తూ… ‘‘మా లిటిల్ చాంప్స్ అందమైన జ్ఞాపకాలను బిగ్ స్క్రీన్‌పై చూడాలని ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను’’ అన్నారు. అంతేకాకుండా, ఈ చిత్రానికి తనికెళ్ల భరణి గారి కల ప్రాణం పోసుకోవడం గర్వకారణమని, అలాగే ఇందులో భాగమవుతున్న ప్రభాస్, మోహన్‌లాల్, అక్షయ్ కుమార్, ప్రభుదేవా వంటి ప్రముఖులకు పేరు పేరునా ధన్యవాదాలు తెలిపారు.
ఇంత పాజిటివ్‌గా ట్వీట్ చేసినప్పటికీ… ఆశ్చర్యకరంగా మంచు విష్ణు పేరు మాత్రం ఎక్కడా ప్రస్తావించలేదు. మనోజ్ విష్ణు పేరు ప్రస్తావించకపోవడం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఇదే విషయంపై నెటిజన్లు హాట్ డిబేట్ చేస్తున్నారు. అయినప్పటికీ, మనోజ్ ఈ విధంగా పాజిటివ్ గా మాట్లాడటం, కన్నప్ప హిట్ కావాలని కోరుకోవడం అభిమానులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఈ నేపథ్యంలో, “విష్ణు పేరు లేకపోయినా మనోజ్‌కు తన కుటుంబం పట్ల ప్రేమ మాత్రం మిగిలే ఉంది” అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరోసారి మనోజ్ తన ట్వీట్‌తో వైరల్ అయ్యాడు.