ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ (Mandakrishna Madiga)కు గ్రేటర్ వరంగల్ మున్సిపల్ అధికారులు షాక్ ఇచ్చారు. ఆయనకు చెందిన అక్రమ కట్టడాలపై బుల్డోజర్లను పంపారు. హనుమకొండలోని హంటర్ రోడ్డు సర్వే నంబరు 125కేలోని 400 గజాల నిర్మాణాలను అధికారులు కూల్చివేశారు.
అవి ఆక్రమణలే
హంటర్ రోడ్డులో తమకు చెందిన 400 గజాలను మందకృష్ణ మాదిగతో పాటు జ్యోతి, ఇద్దయ్యలు ఆక్రమించి నిర్మాణాలు చేపట్టారని అధికారులకు ఫిర్యాదు వచ్చింది. నంబూరి చారుమతి అనే మహిళ ఈ ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో రంగంలోకి దిగిన ఉన్నతాధికారులు దీనిపై విచారణ చేపట్టారు. ఆమె ఫిర్యాదులో పేర్కొన్నట్లుగా.. ఆక్రమణ నిజమేనని తేలడంతో కట్టడాలను కూల్చేయాలని (Demolitions) 2022 సెప్టెంబరులో ఆదేశాలు ఇచ్చారు.
కట్టడాలు నేలమట్టం
అయితే ఈ నిర్మాణాలు రెండేళ్లు దాటినా కూల్చలేదని చారుమతి ఇటీవల.. జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్హెచ్ఆర్సీ)ను ఆశ్రయించారు. ఈ మేరకు జనవరి 24వ తేదీలోగా నిర్మాణాలను నేలమట్టం చేయాలని కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. ఎన్హెచ్ఆర్సీ జారీ చేసిన ఉత్తర్వులను రద్దు చేయాలని మందకృష్ణ మాదిగ హైకోర్టును ఆశ్రయించినా ఆయనకు ఊరట దక్కలేదు. దీంతో మున్సిపల్ సిబ్బంది రంగంలోకి దిగి శుక్రవారం రోజున కట్టడాలను నేలమట్టం చేశారు.







