Mana Enadu : భారత మాజీ ప్రధాని, ఆర్థిక సంస్కరణల పితామహుడు మన్మోహన్ సింగ్ (Manmohan Singh)(92) గురువారం రాత్రి తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా వారం రోజుల పాటు సంతాపం దినాలుగా కేంద్ర సర్కార్ ప్రకటించింది. మరోవైపు తెలంగాణ సర్కార్ ఈరోజు సెలవు ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. శనివారం రోజున మన్మోహన్ సింగ్ కు అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
దేశాన్ని గాడిన పెట్టిన మేధావి
దేశానికి 2004 నుంచి 2014 వరకు పదేళ్ల కాలం పాటు ప్రధానమంత్రిగా ఆయన ఎన్నో సేవలందించారు. ప్రధానమంత్రిగా అత్యున్నత పదవిలో ఉన్నా ఆయన చాలా సాదాసీదా జీవితాన్ని గడిపారు. ఎలాంటి హంగు, ఆర్భాటాలు లేకుండా తన బాధ్యతలు నిర్వర్తించారు. మితభాషి అయినా విధానపరంగా దూకుడు కొనసాగిస్తూ దేశానికి, దేశ ప్రజల కోసం ఎన్నో కఠిన నిర్ణయాలు తీసుకున్నారు. ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చి దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టారు.
మన్మోహన్ ఆస్తుల విలువ ఎంతంటే?
అలాంటి అజాతశత్రువు అస్తమించడంతో ఇప్పుడు యావత్ దేశం విచారం వ్యక్తం చేస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆయనకు సంబంధించిన విషయాలు మరిన్ని తెలుసుకునేందుకు ప్రజలు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన పదవులు, సాధించిన విజయాలు, తీసుకువచ్చిన సంస్కరణలు, ప్రసంగాలు, ఫ్యామిలీ (Manmohan Singh Family), ఆస్తుల వంటి వివరాల గురించి తెలుసుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. అయితే మన్మోహన్ సింగ్ ఆస్తుల గురించి చెప్పాలంటే ఆయన నికర ఆస్తుల విలువ రూ.15.77 కోట్లు.
అప్పులు లేని అజాతశత్రువు
రాజ్యసభలో మన్మోహన్ సింగ్ ఇచ్చిన అఫిడవిట్ ప్రకారం ఆయనకు రూ.15 కోట్ల విలువైన ఆస్తి (Manmohan Singh Property) ఉంది. దిల్లీ, చండీగఢ్ లో ఆయనకు ఫ్లాట్ మాత్రమే ఉంది. ఎలాంటి అప్పులు లేవు. ప్రధాని పదవి నుంచి తప్పుకున్న తర్వాత ఆయన క్రియాశీలక రాజకీయాలకు దూరమయ్యారు. అప్పటి నుంచి దిల్లీలో ఆయన తన భార్యతో నివసిస్తున్నారు. డాక్టర్ మన్మోహన్ సింగ్, భార్య గురుశరణ్ కౌర్‌కు ముగ్గురు కుమార్తెలు ఉన్నారు.






