క్రీడల్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే ధ్యాన్ చంద్ ఖేల్ రత్న (Dhyan Chand Khel Ratna) అవార్డు నామినేషన్ల నుంచి డబుల్ ఒలింపిక్ విజేత మను భాకర్ పేరు తొలగించారు. అయితే ఈ విషయం బాగా వైరల్ అవుతుండగా ఎట్టకేలకు షూటర్ మనుభాకర్ (22) (Manu Bhaker) ట్విటర్ (ఎక్స్ ) ద్వారా తన మౌనం వీడారు. తాను ఖేల్ రత్న అవార్డు గెలుచుకున్నా గెలవకపోయినా ఇబ్బంది ఏమీ లేదని అభిప్రాయం వ్యక్తం చేశారు. తనకు అవార్డుల కన్నా.. దేశం కోసం ఆడటం ముఖ్యమని ప్రకటించారు. అవార్డులు తన లక్ష్యం కాదని, దేశం కోసం ఆడటమే తన గోల్ అని చెప్పారు. కాగా ఈ విషయంపై మను భాకర్ తండ్రి తన బిడ్డను క్రికెటర్ చేయాల్సింది అని సంచలన వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
అవార్డులు మోటివేషన్ ఇస్తాయి.. లక్ష్యం మాత్రం కావు
ఒక అథ్లెట్‌గా (Athlete) నా పాత్ర దేశం తరపున అత్యుత్తమ ప్రదర్శన చేయడం అని మను భాకర్ అన్నారు. అవార్డులు మోటివేషన్ ఇస్తాయని, ఉత్సాహపరుస్తాయని తెలుసు కానీ అవి నా లక్ష్యం కావని చెప్పారు. అయితే తాను దాఖలు చేసిన నామినేషన్ లో ఏదైనా లోపం జరిగి ఉండొచ్చని అనుకుంటున్నట్లు పేర్కొన్నారు. అవార్డుతో సంబంధం లేకుండా, నా దేశం కోసం మరిన్ని పతకాలు గెలుచుకోవడానికి నేను ఇప్పటికే ప్రేరణ పొంది ఉన్నానని ధీమా వ్యక్తం చేశారు. ఈ విషయంపై ఎక్కువగా పుకార్లు నమ్మొద్దని, ఊహగానాలకు తెరలేపొద్దని అభ్యర్థించారు.
నా బిడ్డను క్రికెటర్ చేయాల్సింది: మను భాకర్ తండ్రి
ఈ ప్రతిష్టాత్మకమైన అవార్డు నామినేషన్ లిస్టు నుంచి ఆమె పేరును అధికారులు తొలగించగా.. దీంతో మను భాకర్ తండ్రి రామ్ కిషన్ భాకర్ అవార్డుల కమిటీపై విమర్శలు గుప్పించారు. నా బిడ్డను క్రికెటర్ ను చేసి ఉండాల్సింది అని టైమ్స్ ఆఫ్ ఇండియాకు (Times of India) ఇచ్చిన ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆయన చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. కాగా మను భాకర్ ఈ ఏడాది పారిస్ ఒలింపిక్స్ (Paris Olympics) లో షూటింగ్ విభాగంలో రెండు బ్రౌంజ్ (కాంస్య) పతకాలు (Bronze Medal)సాధించారు. ఆమె విజయాలను దేశ ప్రజలు సంబురంగా జరుపుకున్నారు.








