తెలంగాణ(Telangana)లోని ములుగు జిల్లా, తాడ్వాయి మండలంలో జరిగే ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన ఉత్సవం మేడారం సమ్మక్క-సారలమ్మ మహా జాతర (Medaram Sammakka-Saralamma Maha Jatara-2026) తేదీలు ఖరారయ్యాయి. పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్దబోయిన జగ్గారావు ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ జాతర 2026 జనవరి 28 నుంచి 31 వరకు నాలుగు రోజుల పాటు ఘనంగా నిర్వహించనున్నారు.
సారలమ్మ ఆగమనంతో..
జాతర షెడ్యూల్ ప్రకారం వచ్చే జనవరి 28న సాయంత్రం 6 గంటలకు సారలమ్మ(Saralamma), గోవిందరాజు, పగిడిద్దరాజు(Govindaraja, Pagiddaraja) గద్దెలపైకి చేరుకుంటారు. జనవరి 29న సమ్మక్క(Sammakka) దేవత చిలకలగుట్ట(Chilakalagutta) నుంచి గద్దెకు ఆగమనం అవుతుంది. జనవరి 30న భక్తులు అమ్మవార్లకు మొక్కులు చెల్లించుకుంటారు. చివరి రోజైన జనవరి 31న సాయంత్రం 6 గంటలకు సమ్మక్క, సారలమ్మ, గోవిందరాజు, పగిడిద్దరాజులు వన ప్రవేశం చేస్తారు, దీంతో జాతర ముగుస్తుంది.
BIG NEWS : 2026 Medaram “Sammakka Sarakka Jatara” festival celebration dates and Announced by Temple Committee. #medaram #sammakkasarakka #Telangana pic.twitter.com/UVyIS4xHTS
— NHTV (@NHTV24x7) July 2, 2025
రూ. 75 కోట్ల నిధులతో ఏర్పాట్లు
తెలంగాణ కుంభమేళ(Telangana Kumbh Mela)గా పేరొందిన ఈ జాతరకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్(AP), మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, ఒడిశా వంటి రాష్ట్రాల నుంచి కోట్లాది మంది భక్తులు హాజరవుతారు. గిరిజన సంప్రదాయాల ప్రకారం జరిగే ఈ ఉత్సవంలో భక్తులు బెల్లం, పసుపు, కుంకుమ, చీరలు సమర్పిస్తూ మొక్కులు తీర్చుకుంటారు. జంపన్న వాగులో పుణ్యస్నానాలు ఆచరిస్తారు. తెలంగాణ ప్రభుత్వం ఈ జాతరను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుంది. భక్తుల సౌకర్యం కోసం రూ. 75 కోట్ల నిధులతో ఏర్పాట్లు చేస్తోంది. శాశ్వత అభివృద్ధి పనులు, వైద్య శిబిరాలు, పారిశుద్ధ్యం, రవాణా సౌకర్యాలు సిద్ధం చేస్తున్నారు.






