Mana Enadu : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప-2 (Pushpa 2) బెన్ ఫిట్ షో సమయంలో ఆయన సంధ్య థియేటర్ కు రాగా జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ మరణించిన విషయం తెలిసిందే. ఈ కేసులో తాజాగా ఆయణ్ను చిక్కడపల్లి పోలీసులు అరెస్టు చేసి ఠాణాకు తరలించారు. అక్కడ స్టేట్ మెంట్ రికార్డు చేసుకున్నారు. ఈ క్రమంలో అల్లు అర్జున్ అరెస్టు ఘటనపై సినీ ప్రముఖులు, పలువురు రాజకీయ నేతలు స్పందిస్తున్నారు. ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు ఓవైపు అల్లు అర్జున్ (Allu Arjun) నివాసానికి, మరోవైపు చిక్కడపల్లి ఠాణాకు చేరుకుంటున్నారు.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్టు విషయం తెలిసిన వెంటనే ఆయన మామ, మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) తన సినిమా షూటింగు నుంచి అల్లు నివాసానికి వెళ్లారు. ఈ సందర్భంగా వారి కుటుంబానికి ధైర్యం చెప్పారు. ఆయన వెంట ఆయన సతీమణి సురేఖ కూడా ఉన్నారు. మరోవైపు మరో మామ నాగబాబు (Nagababu) కూడా అల్లు అరవింద్ నివాసానికి వెళ్లారు. కాగా.. చిక్కడపల్లి ఠాణాకు ప్రముఖ నిర్మాత దిల్ రాజు సహా పలువురు సినీ ప్రముఖులు చేరుకున్నారు. అంతే కాకుండా బన్నీ ఫ్యాన్స్ భారీగా చేరుకుని తమ ఐకాన్ స్టార్ కు మద్దతు పలుకుతున్నారు. ఈ క్రమంలో పోలీసులు భారీగా మోహరించారు.
మరోవైపు అల్లు అర్జున్ క్వాష్ పిటిషన్ (Allu Arjun Arrest)పై విచారణ కోసం ఆయన న్యాయవాది తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అత్యవసర పిటిషన్‌గా విచారించాలని తెలంగాణ హైకోర్టును కోరగా.. అత్యవసర పిటిషన్‌ను ఉ.10.30కే మెన్షన్ చేయాలి కదా అని ప్రశ్నించింది. క్వాష్ పిటిషన్‌పై పోలీసుల దృష్టికీ తెచ్చామన్న అల్లు అర్జున్ లాయర్ నిరంజన్ రెడ్డి చెప్పగా.. పిటిషన్‌ను సోమవారం విచారిస్తామని న్యాయస్థానం పేర్కొంది.
అయితే పరిస్థితుల దృష్ట్యా లంచ్ మోషన్ పిటిషన్‌గా స్వీకరించాలని కోరగా.. మ.1.30 గం.కు లంచ్ మోషన్ పిటిషన్ విచారణ కోరడం సరికాదని .. సోమవారం వరకు చర్యలు తీసుకోకుండా పోలీసులను ఆదేశించాలని కోరారు. పోలీసుల నుంచి పూర్తి వివరాలు సేకరించి 4 గంటలకు చెబుతానని పీపీ పేర్కొనగా.. విచారణ సాయంత్రం 4 గంటలకు వాయిదా వేసిన తెలంగాణ హైకోర్టు.






