నల్గొండ జిల్లాలోని నాగార్జున సాగర్ జలాశయం నిండుకుండలా మారింది. ఎగువ ప్రాంతాల నుంచి భారీ వరద ప్రవాహం కొనసాగుతోంది. జలాశయం పూర్తి స్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం 580.60 అడుగులకు చేరుకుంది. ఈ నేపథ్యంలో అధికారులు ఆగస్టు 11న ఎనిమిది క్రస్ట్ గేట్లను 5 అడుగుల మేర ఎత్తి, దిగువకు 64,465 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం జలాశయంలోకి 65,800 క్యూసెక్కుల వరద నీరు చేరుతుండగా, ఔట్‌ఫ్లో 1,10,483 క్యూసెక్కులుగా ఉంది. జలాశయ నీటి నిల్వ 312.04 టీఎంసీలుగా నమోదైంది. శ్రీశైలం, జూరాల ప్రాజెక్టుల నుంచి వస్తున్న వరద కారణంగా నాగార్జున సాగర్‌లో నీటి ఒత్తిడి పెరిగింది. దీంతో లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. నదీ పరీవాహక ప్రాంతాల్లోకి వెళ్లవద్దని సూచించారు. గేట్లు ఎత్తివేతతో కృష్ణమ్మ పరవళ్లు అద్భుత దృశ్యాన్ని సృష్టిస్తుండటంతో పర్యాటకులు భారీగా తరలివస్తున్నారు.






