తాను నిర్మిస్తున్న సినిమాల గురించి ప్రొడ్యూసర్ నాగవంశీ హైప్ ఎక్కిస్తున్నారు. పవన్ కల్యాణ్(Pawan kalyan)తో హరిహర వీరమల్లు (Hari Hara Veera Mallu), విజయ్ దేవరకొండ (Vijay Deverakonda)తో కింగ్డమ్ (Kingdom) సినిమాలను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. కాగా ఈ రెండు హై బడ్జెట్ మూవీలు విజయం సాధిస్తాయని పేర్కొన్నారు. వాటిల్లోని సర్ప్రైజ్లు చూసేందుకు సిద్ధంగా ఉండాలని అన్నారు. హరిహర వీరమల్లు, కింగ్డమ్ సినిమాల గురించి తాజాగా ఆసక్తికర పోస్టులు పెట్టారు.
పవన్ కల్యాణ్ ఫైర్‌లా కనిపించనున్నారు
‘హరిహర వీరమల్లు’ ట్రైలర్ అద్భుతంగా ఉందని, మరో మూడు రోజుల్లో ఆడియన్స్ ముందుకురానుందని పేర్కొన్నారు. ‘‘మీరు ఏం కోరుకుంటున్నారో నాకు తెలియదు. కానీ, జులై 3న మీరు తప్పకుండా సర్‌ప్రైజ్ అవుతారు. పవన్ కల్యాణ్ ఫైర్‌లా కనిపించనున్నారు. సర్‌ప్రైజ్‌ని చూసేందుకు మిమ్మల్ని మీరు సిద్ధం చేసుకోండి. హరిహర వీరమల్లు ట్రైలర్ అద్భుతంగా ఉంది. మీరు ఎప్పుడూ చూడని ఎనర్జీని చూడనున్నారు. ఆ ఎనర్జీని ఫీలవుతారు. దాని గురించి మాట్లాడుకుంటారు’’ అని అన్నారు. ఇప్పటికే పలుమార్లు వాయిదా పడిన హరిహర వీరమల్లును జులై 24న రిలీజ్ చేస్తామని టీమ్ ఇదివరకే ప్రకటించింది.
ఆ అనుభూతిని అంచనా వేయలేం..
‘కింగ్డమ్’ (Kingdom) సినిమా గురించి సోషల్ మీడియాలో వస్తున్న పోస్టుల గురించి కూడా నాగవంశీ మాట్లాడారు. ట్రోలింగ్పై స్పందించారు. ‘‘ఏం పోస్ట్ చేసినా.. ‘కింగ్డమ్’ మూవీకి సంబంధించి అప్పుడప్పుడు తిట్లు వస్తూనే ఉంటాయని నాక్కూడా తెలుసు. నన్ను నమ్మండి.. వెండితెరపై ప్రేక్షకులకు ఒక అద్భుతమైన అనుభూతిని అందించేందుకు టీమ్ మొత్తం శ్రమిస్తున్నాం. ఈ సినిమా చూసిన తర్వాత మీకు కలిగే అనుభూతిని అంచనా వేయలేం. ఇది మాత్రం మాటిస్తున్నా. నేను ఎంతో నమ్మితే కానీ ఇలా చెప్పననే విషయం మీ అందరికీ తెలుసు. ఎందుకంటే ఏమాత్రం మిస్ అయినా మీ క్రియేటివిటీ అంతా నాపై చూపిస్తారు. సినిమా చూసిన తర్వాత చెబుతున్నా.. ‘కింగ్డమ్’ అంతటా విజయాన్ని అందుకోనుంది. త్వరలో అదిరిపోయే రిలీజ్ డేట్, టీజర్, సాంగ్ అనౌన్స్‌మెంట్‌తో మళ్లీ కలుద్దాం’’ అని ఆయన పోస్ట్ పెట్టారు.






