Mana Enadu : హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట కేసులో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) దాఖలు చేసిన బెయిల్ పిటిషన్పై నాంపల్లి కోర్టులో సోమవారం రోజున విచారణ జరిగింది. ఈ కేసులో బన్నీకి బెయిల్ ఇవ్వొద్దంటూ చిక్కడపల్లి పోలీసులు కౌంటర్ దాఖలు చేశారు. మరోవైపు అల్లు అర్జున్ తరఫు న్యాయవాదులు బెయిల్ మంజూరు చేయాలంటూ వాదనలు వినిపించగా.. ఇరు పక్షాల వాదనలను విన్న కోర్టు.. తీర్పును జనవరి 3వ తేదీకి వాయిదా వేసింది.
జనవరి 3కి వాయిదా
సంధ్య థియేటర్ తొక్కిసలాట (Sandhya Theatre Case) ఘటనలో పోలీసులు ఇటీవల అల్లు అర్జున్ను అరెస్ట్ చేయగా.. ఆయనకు హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. దీంతో ఆయన జైలు నుంచి విడుదలయ్యారు. మరోవైపు నాంపల్లి కోర్టు (Nampally Court) బన్నీకి 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించగా.. ఈనెల 27వ తేదీన రిమాండ్ ముగిసింది. అదే రోజు ఆయన వర్చువల్గా కోర్టుకు హాజరవ్వగా.. విచారణను 30కి వాయిదా వేసింది. దీంతో నాంపల్లి కోర్టు నేడు విచారణ చేపట్టి తీర్పు వచ్చే నెల 3వ తేదీకి వాయిదా వేసింది.
ఇదీ జరిగింది
హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్ లో డిసెంబరు 4వ తేదీన పుష్ప-2 సినిమా బెనిఫిట్ షో వేశారు. ఈ షోకు అల్లు అర్జున్ తన కుటుంబం, హీరోయిన్ రష్మిక మందన్నతో కలిసి వచ్చారు. ఆయన రోడ్ షోగా రాగా బన్నీని చూసేందుకు జనం ఎగబడ్డారు. పరిస్థితులు అదుపుతప్పడంతో పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. ఈ క్రమంలో జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ మరణించింది. ఆమె కుమారుడు ప్రస్తుతం ప్రాణాల కోసం ఆస్పత్రిలో పోరాడుతున్నాడు. ఈ కేసులో అల్లు అర్జున్ ను ఏ11గా పరిగణించిన పోలీసులు ఆయణ్ను అరెస్టు చేసిన విషయం తెలిసిందే.






