
తెలుగు యూత్ ఆడియన్స్ ని విపరీతంగా ఆకట్టుకున్న ‘ఈ నగరానికి ఏమైంది’ సినిమాకు సీక్వెల్ రాబోతున్న సంగతి తెలిసిందే. దర్శకుడు తరుణ్ భాస్కర్ ఈ ప్రాజెక్టును ఇటీవల అధికారికంగా ప్రకటించారు. ‘ఈNఈ రిపీట్’ అనే టైటిల్‌తో ఈ సినిమా రూపొందుతోందని స్పష్టం చేశారు. అయితే తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఓ ఆసక్తికరమైన వార్త టాలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వార్తల ప్రకారం, ఈ సీక్వెల్‌లో నందమూరి బాలకృష్ణ అతిథి పాత్రలో కనిపించనున్నారని తెలుస్తోంది.
మొదటి భాగం ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న నటులు విష్వక్ సేన్, సాయి సుశాంత్ రెడ్డి, అభినవ్ గోమటం, వెంకటేశ్ కాకుమాను ఈ సీక్వెల్‌లోనూ తమ పాత్రలను కొనసాగిస్తున్నారు. సురేశ్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై డి. సురేశ్ బాబు, సృజన్ యరబోలు కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మొదటి భాగానికి అద్భుతమైన సంగీతాన్ని అందించిన వివేక్ సాగర్ ఈ సీక్వెల్‌కు కూడా స్వరాలు సమకూర్చనున్నారు.
అయితే ఈ ప్రాజెక్టుతో నటసింహం బాలకృష్ణ కనిపించబోతున్నట్లు వస్తున్న వార్తలపై అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొంది. నటుడు విష్వక్ సేన్‌కు బాలకృష్ణ అంటే అసాధారణమైన అభిమానం ఉంది. తన అభిమాన హీరో ఈ చిత్రంలో కనిపించాలని విశ్వక్ కోరడంతో బాలకృష్ణ వెంటనే ఓకే చేశారన్న టాక్ టాలీవుడ్‌లో వినిపిస్తోంది. కాకపోతే ఈ వార్తలపై చిత్రబృందం నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. బాలకృష్ణ నిజంగా ఈ చిత్రంలో భాగమైతే, ‘ఈNఈ రిపీట్’ పై అంచనాలు మరింతగా పెరగడం ఖాయమని సినీ వర్గాలు పేర్కొంటున్నాయి. సో, చూడాలి మరి ఏం జరుగుతుందనేది.