ఇందూరు జిల్లా రైతుల చిరకాల వాంఛ నెరవేరింది. ఎన్నో ఏళ్ల నుంచి చేస్తున్న పోరాటఫలం లభించింది. ఎట్టకేలకు జాతీయ పసుపు బోర్డు (National Turmeric board) నిజామాబాద్‌లో ఏర్పాటైంది. కేంద్ర వాణిజ్యశాఖ మంత్రి పీయూష్ గోయల్ దిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వర్చువల్‌గా దీనిని ఇవాళ (జనవరి 14వ తేదీన) ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ ధర్మపురి అర్వింద్ పాల్గొన్నారు.
2023లో ప్రకటన.. 2025లో ఏర్పాటు
గత అసెంబ్లీ ఎన్నికల ప్రచారం సందర్భంగా 2023 అక్టోబరు 1న మహబూబ్‌నగర్ సభలో నిజామాబాద్‌లో పసుపు బోర్డును ఏర్పాటు చేయనున్నట్లు ప్రధాని మోదీ ప్రకటించిన విషయం తెలిసిందే. అక్టోబరు 4వ తేదీన కేంద్ర వాణిజ్య శాఖ దీనిపై గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. తాజాగా నిజామాబాద్‌లో బోర్డు (Nizamabad Turmeric Board) ఏర్పాటు చేస్తున్నట్లు సోమవారం ప్రకటించింది.
పసుపు బోర్డు ఛైర్మన్ ఎవరంటే..
ప్రస్తుతం నిజామాబాద్‌లో ఉన్న రీజినల్ స్పైస్ బోర్డు కార్యాలయంలోనే పసుపు బోర్డు కార్యకలాపాలు ప్రారంభమవుతాయి. ఈ బోర్డుకు ఛైర్మన్‌గా నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం అంకాపూర్ గ్రామానికి చెందిన బీజేపీ నాయకుడు పల్లె గంగారెడ్డిని నియమించింది. . ఈయన మూడేళ్ల పాటు పదవిలో కొనసాగుతారు. మరోవైపు తెలంగాణలో పసుపు బోర్డు ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నందుకు ప్రధాని మోదీకి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కృతజ్ఞతలు తెలిపారు.







