సామాన్యుల నుంచి వ్యాపారుల వరకు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న కేంద్ర వార్షిక బడ్జెట్ రానే వచ్చింది. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్(Nirmala Sitharaman) పార్లమెంట్‌లో 8వ సారి బడ్జెట్(Union Budget)ను ప్రవేశపెట్టారు. లోక్‌సభలో 2025-26 సంబంధించిన బడ్జెట్‌ను ప్రవేశపెట్టే ముందు తెలుగు మహాకవి గురజాడ అప్పారావు(Gurjada Apparao) కవిత్వంతో ఆర్థిక మంత్రి కేంద్ర బడ్జెట్ ప్రారంభించారు. ‘దేశమంటే మట్టికాదోయ్ దేశమంటే మనుషులోయ్’ అంటూ సీతారామన్ గురజాడ కవిత్వాన్ని పలికారు. ప్రతిపక్ష పార్టీలు నిరసనలు చేస్తుండగా సీతారామన్ బడ్జెట్ ప్రసంగం ప్రారంభించారు. నిర్మలా సీతారామన్ బడ్జెట్ చదవడం మొదలుపెట్టగానే.. విపక్ష నాయకులు(Opposition leaders) ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కుంభమేళాలో జరిగిన తొక్కిసలాటపై చర్చించాలని పట్టుబట్టారు. స్పీకర్(Speaker) అందుకు నిరాకరించడంతో ఆందోళన చేపట్టారు. అనంతరం సభ నుంచి వాకౌట్(Walkout) చేసి మళ్లీ వచ్చారు.
రైతులు, మహిళలకు ప్రత్యేక ప్రాధాన్యత
నిర్మల తన ప్రసంగంలో ఇంకా ఏమన్నారంటే.. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వృద్ధి(Economic growth) మందగించినా భారత్ మెరుగైన పనితీరు కనబరిచిందని మంత్రి పేర్కొన్నారు. పేదలు, యువత, రైతులు, మహిళలకు ప్రత్యేక ప్రాధాన్యమిస్తూ, త్వరిత, సమ్మిళిత అభివృద్ధి పెట్టుబడుల సాధన లక్ష్యంగా బడ్జెట్ ను రూపొందించామని నిర్మలా సీతారామన్ తెలిపారు. గత పదేళ్లలో సాధించిన అభివృద్ధే మాకు స్ఫూర్తిదాయకం, మార్గదర్శకమని వెల్లడించారు.
వలసలు అరికట్టడంపై దృష్టి
దేశంలో వలసలు అరికట్టడంపై ప్రధానంగా దృష్టిసారించినట్లు మంత్రి పేర్కొన్నారు. రైతుల కోసం కిసాన్ క్రెడిట్ కార్డు(Kisan Credit Card) పరిమితిని 3 లక్షల నుంచి 5 లక్షలకు పెంచుతున్నట్లు ప్రకటించారు. ఈ నిర్ణయంతో 7.7 కోట్ల రైతులకు ప్రయోజనం కలగనుందని చెప్పారు. పప్పు ధాన్యాల ఉత్పత్తికి స్వయం సమృద్ధి పథకం ప్రవేశ పెడుతున్నట్లు పేర్కొన్నారు. ‘పీఎం ధన్ ధాన్య కృషి యోజన’ను దేశవ్యాప్తంగా 100 జిల్లాల్లో ప్రారంభించనున్నట్లు తెలిపారు.






