
ఉద్యోగ(Job) అవకాశాల కోసం ఎదురుచూస్తున్న వారికి శుభవార్త. డిగ్రీ లేకపోయినా(No Degree Required), హైస్కూల్ చదువుతున్నవారికీ ఇప్పుడు బంపర్ ఛాన్స్ వచ్చింది. భారతీయ స్టార్టప్ పచ్ AI నెలకు రూ.2 లక్షల వరకు స్టైపెండ్ ఇచ్చే ఇంటర్న్‌షిప్‌లను ప్రకటించింది. AI Engineer, Growth Magician పోస్టుల కోసం ఇచ్చిన ఈ ఆఫర్ సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది.
కంపెనీ సహ వ్యవస్థాపకుడు, సీఈఓ సిద్ధార్థ్ భాటియా(Siddharth Bhatia) తన X (ట్విట్టర్) ఖాతాలో ఈ అవకాశాన్ని ప్రకటించారు. నెలకు రూ.1 లక్ష నుంచి రూ.2 లక్షల వరకు స్టైపెండ్ అందించబడుతుంది. ప్రత్యేకంగా చెప్పాలంటే, ఈ ఉద్యోగాలకు ఎలాంటి డిగ్రీ అవసరం లేదు. హైస్కూల్ విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తిగా రిమోట్ వర్క్ మోడ్‌లో ఉండే ఈ ఇంటర్న్‌షిప్‌లో, ఇంటి నుంచే పని చేస్తూ మంచి ఆదాయం పొందే అవకాశం ఉంటుంది.
దరఖాస్తు ప్రక్రియ
ఆసక్తి కలిగిన వారు భాటియా పోస్ట్‌లోనే కామెంట్ చేయాలి. “మేము మిమ్మల్ని ఎందుకు ఎంపిక చేయాలి?”, “పచ్ AIలో ఏ పని చేయాలని అనుకుంటున్నారు?” అనే ప్రశ్నలకు సమాధానమివ్వాలి. డైరెక్ట్ మెసేజ్‌లు పంపవద్దని భాటియా సూచించారు. సరైన అభ్యర్థులను సిఫారసు చేయాలనుకునే వారు వారిని ట్యాగ్ చేయవచ్చు. ఎంపికైన వారు ట్యాగ్ చేసిన వ్యక్తికి iPhone బహుమతిగా అందుతుంది.
ప్రస్తుతం పచ్ AI ఒక హ్యాకథాన్ కూడా నిర్వహిస్తోంది. ఇందులో విజేతలకు నేరుగా ఇంటర్న్‌షిప్ ఆఫర్ లభిస్తుంది. టాప్ 10లో స్థానం సంపాదించిన వారికి కంపెనీ ఫౌండర్లతో నేరుగా ఇంటర్వ్యూ చేసే అవకాశం లభిస్తుంది.
ఈ ఆఫర్ సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతోంది. లింక్డ్ఇన్‌లో పోస్ట్‌కు వేల లైకులు, వందల కామెంట్లు వస్తున్నాయి. డిగ్రీ అవసరం లేకపోవడం, భారీ జీతం, ఇంటి నుంచే పని చేసే సౌకర్యం వంటి కారణాలతో యువత ఈ అవకాశాన్ని అందుకోవాలని పోటీపడుతున్నారు.