ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం(AP Government)లో కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం పాఠశాలల(Schools)పై కీలక నిర్ణయం తీసుకుంది. విద్యా వ్యవస్థను రాజకీయాల నుంచి పూర్తిగా దూరంగా ఉంచే ఉద్దేశంతో కొత్త నిబంధనలు ప్రవేశపెట్టింది. ఈ నిర్ణయాల మేరకు పాఠశాలల్లో రాజకీయ కార్యకలాపాలకు తావు లేకుండా చట్టబద్ధమైన చర్యలు తీసుకుంటున్నట్లు ప్రకటించింది.
ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం, ఇకపై పాఠశాలల ఆవరణలోకి రాజకీయ నాయకులు, అనధికారిక వ్యక్తులు ప్రవేశించడానికి నిషేధం(No More Entry ) విధించింది. తల్లిదండ్రులు, స్కూల్ మేనేజ్‌మెంట్ కమిటీ సభ్యులు మాత్రమే అనుమతితో స్కూల్‌లోకి వెళ్లవచ్చు.
అంతేకాక, స్కూల్ ఆవరణలో రాజకీయ పార్టీల బ్యానర్లు, పోస్టర్లు, జెండాలు, ఇతర గుర్తులు ప్రదర్శించడాన్ని పూర్తిగా నిషేధించింది. విద్యార్థులపై ఎలాంటి రాజకీయ ప్రభావం పడకుండా చూడటమే దీని ముఖ్య ఉద్దేశం.
అలాగే, విద్యార్థులకు కానుకలు ఇవ్వడం లేదా స్కూల్‌కి విరాళాలు అందించాలంటే ప్రభుత్వ అనుమతి తప్పనిసరి అని స్పష్టం చేసింది. అనుమతి లేకుండా ఎవరూ స్కూల్‌లో కానుకలు పంపిణీ చేయరాదు.
పాఠశాలల్లో విద్యార్థుల ఫోటోలు తీయడం, బయటి వారు టీచర్లను, విద్యార్థులను కలవడం నిషేధించబడింది. ఎవరైనా సమస్యలు లేదా ఫిర్యాదులు ఉంటే, అవి అడ్మినిస్ట్రేషన్ విభాగం వద్దనే చేయాలనీ ప్రభుత్వం స్పష్టం చేసింది.
ఈ చర్యలతో పాఠశాలలు విద్యకి మాత్రమే పరిమితమవుతాయని, పిల్లల అభ్యాసంలో ఆటంకాలు లేకుండా ఉంటాయని ప్రభుత్వం ఆశిస్తోంది. విద్యార్థుల భవిష్యత్ దృష్టిలో పెట్టుకొని తీసుకున్న ఈ నిర్ణయం పాజిటివ్‌గా మారుతుందని భావిస్తున్నారు.






