ManaEnadu : తెలంగాణలో 18 ఏళ్లు నిండిన వారిలో 42.4 శాతం మంది అప్పుల్లో ఉన్నట్లు జాతీయ శాంపుల్ సర్వే సంస్థ (NSSO) నివేదిక వెల్లడించింది. దేశ సగటుతో పోలిస్తే ఇది చాలా ఎక్కువ అని తెలిపింది. జాతీయ స్థాయిలో 8,758 గ్రామాలు, 6,540 పట్టణాల్లోని 3.02 లక్షల కుటుంబాలపై విద్య, ఆరోగ్యం, అప్పులు, మొబైల్, ఇంటర్నెట్ (Internet) తదితర అంశాలపై సర్వే నిర్వహించి రాష్ట్రంలోని పరిస్థితులను విశ్లేషించింది.
98.3 శాతం మహిళలకు చదవడమొచ్చు
తెలంగాణలో 15-24 ఏళ్లలోపు యువతలో 99.2% మంది పురుషులు, 98.3% మంది మహిళలకు చదవడం, తేలికైన వాక్యాలు రాయడంతోపాటు రోజువారీ లెక్కలు చేసే సామర్థ్యముందని ఈ సర్వేలో తేలింది. 18 ఏళ్లు పైబడిన 97.5% మందికి వ్యక్తిగత లేదా సంయుక్త బ్యాంకు (Joint Bank Accounts) ఖాతాలు.. గ్రామాల్లో 98%, పట్టణాల్లో 96.9% మందికి బ్యాంకు ఖాతాలున్నాయి. 21-35 ఏళ్లు ఉన్న యువతలో 66.3% మంది సైన్స్ అండ్ టెక్నాలజీ కోర్సులుండగా.. గ్రామాల్లో ఈ కోర్సులు చేసిన వారు 58.2%, పట్టణాల్లో 71.5% మంది ఉన్నారు.
18 ఏళ్లు పైబడిన వారికి అప్పుల బాధలు
ఆర్థిక ఇబ్బందుల కారణంగా ప్రజల్లో ఎక్కువ మంది అత్యవసరాల కోసం అప్పులు (Loans) చేస్తున్నారు. రాష్ట్రంలోని 18 ఏళ్లకు పైబడిన వారిలో ప్రతి లక్ష మందికి 42,407 మంది అప్పుల బాధతో సతమతమవుతున్నారు. 18 ఏళ్లు నిండిన ప్రతి లక్ష మందిలో గ్రామీణ ప్రాంతాల్లో 50,289 మంది, పట్టణాల్లో 31,309 మంది అప్పుల్లో ఉన్నారు.
ఐటీ నైపుణ్యలు ఇలా ఉన్నాయి
తెలంగాణలో ఇంటర్నెట్ (Telangana Internet)పై సమాచారం కోసం 72.8%, ఆన్‌లైన్ బ్యాంకింగ్ లావాదేవీలు 61.8% మంది, ఎలక్ట్రానిక్ సందేశాలు పంపడం: 52.6% మంది ఆధారపడుతున్నారు. ఇత ల్యాప్‌టాప్, కంప్యూటర్లు ఉన్న గృహాలు 13.7% ఉండగా.. మొబైల్/టెలిఫోన్ ఉన్న గృహాలు: 93.0% ఉన్నాయని ఈ సర్వేలో తేలింది.






