Mana Enadu : ఇజ్రాయెల్-గాజా (Israel Gaza War) మధ్య యుద్ధం ప్రారంభమై సరిగ్గా నేటి(అక్టోబర్ 7వ తేదీ 2024)కి ఏడాది. ఇజ్రాయెల్ (Israel) పై హమాస్ దాడి చేసి ఏడాది పూర్తయిన సందర్భంగా ఐడీఎఫ్ కీలక డేటాను వెల్లడించింది. గాజా పట్టీలో 17,000 మంది హమాస్ ఆపరేటివ్‌లను, ఇజ్రాయెల్‌లో 1,000 మంది ఉగ్రవాదులను మట్టుబెట్టినట్లు తెలిపింది.
4700 సొరంగాలు ధ్వంసం
“గాజా పట్టీలో 40,300 లక్ష్యాలపై దాడులు చేశాం. మొత్తం 4,700 సొరంగ ప్రవేశమార్గాలను ధ్వంసం చేశాం. అక్టోబర్ 8 నుంచి లెబనాన్‌లోని హెజ్‌బొల్లా కూడా మాపై దాడులు మొదలుపెట్టింది. మేము ఎదురుదాడుల్లో ఆ సంస్థకు చెందిన మొత్తం 800 మందిని మట్టుబెట్టగా వీరిలో 90 మంది టాప్ కమాండర్లు ఉన్నారు. అదే సమయంలో 11,000 హెజ్‌బొల్లా స్థావరాలను పేల్చేశాం” అని IDF పేర్కొంది.
నాటి దాడుల్లో 1200 ఇజ్రాయెలీలు మృతి
2023 అక్టోబర్ 7వ తేదీన ఇజ్రాయెల్‌పైకి హమాస్ (Israel Hamas War) బలగాలు విరుచుకుపడ్డ విషయం తెలిసిందే. నాటి దాడుల్లో మొత్తం 1,200 మంది ఇజ్రాయెలీలు ప్రాణాలు కోల్పోగా.. 251 మంది కిడ్నాప్‌నకు గురయ్యారు. వీరిలో కొందరిని విడిపించగా.. మరికొందరు ప్రాణాలు కోల్పోయారు. హమాస్ వద్ద ఇప్పటికీ దాదాపు 100 మంది వరకు బందీలుగానే ఉన్నారు.
ఇజ్రాయెల్ పై హెజ్బొల్లా దాడులు
ఇక ప్రస్తుతం హమాస్, హెజ్‌బొల్లా (Hezbollah)పై ఐడీఎఫ్ తమ దాడుల తీవ్రతను మరింత పెంచింది. హెజ్‌బొల్లా కూడా ఇజ్రాయెల్ (Israel)లోని మూడో అతిపెద్ద నగరం, పోర్ట్ సిటీ అయిన హైఫాపై సోమవారం తెల్లవారుజామున.. ‘ఫాది 1’ క్షిపణులు ప్రయోగించింది. ఐడీఎఫ్ సైనిక స్థావరాన్ని లక్ష్యంగా చేసుకుని చేసిన ఈ దాడిలో ఐదు రాకెట్లు తమ భూభాగాన్ని తాకాయని ఇజ్రాయెల్ ఆర్మీ ధ్రువీకరించింది. ఈ ఘటనలో పది మంది గాయపడినట్లు స్థానిక మీడియా కథనాలు తెలిపాయి.
ఇజ్రాయెల్ వార్నింగ్ తో ఇరాన్ అలర్ట్
మరోవైపు ఏ క్షణమైనా దాడులు చేస్తామని ఇజ్రాయెల్ హెచ్చరికల నేపథ్యంలో ఇరాన్ (Iran) అలర్ట్ అయింది. ఈ నేపథ్యంలో విమాన సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేసిన టెహ్రాన్.. వాటిని పునరుద్ధరించింది. ఆదివారం రాత్రి 11 గంటల నుంచే షెడ్యూల్ ప్రకారం విమాన సర్వీసులు ప్రారంభమయ్యాయి.