
భారత విమానాలకు తమ గగనతలాన్ని మూసివేస్తూ పాకిస్థాన్(Pakistan closing its airspace) తీసుకున్న నిర్ణయాన్ని మరో నెల రోజుల పాటు పొడిగించినట్టు తెలుస్తోంది. ఇరు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో పాకిస్థాన్(Pakistan) ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఏప్రిల్ 22న పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడి(terrorist attack) అనంతరం భారత్ చేపట్టిన చర్యలకు ప్రతిస్పందనగా, పాకిస్థాన్ గత నెలలో భారత విమానాలపై తమ గగనతలంలో ప్రయాణించకుండా నిషేధం విధించింది. అంతర్జాతీయ పౌర విమానయాన సంస్థ(International Civil Aviation Organization Rules) నిబంధనల ప్రకారం గగనతల ఆంక్షలను ఒకేసారి నెల రోజులకు మించి విధించకూడదు. దీంతో మే 23 వరకు ఈ నిషేధం అమల్లో ఉంది.
ఆపరేషన్ సిందూర్‌తో నిర్ణయం
తాజాగా ఈ నిషేధాన్ని మరో నెల పొడిగించాలని పాకిస్థాన్ నిర్ణయించినట్లు జియో న్యూస్ వర్గాలు పేర్కొన్నాయి. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన (Notice to Airmen-NOTAM) ఈరోజు (మే 22) వెలువడే అవకాశం ఉందని సమాచారం. ఏప్రిల్ 22న పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది పర్యాటకులు మరణించిన విషయం తెలిసిందే. ఈ దాడికి ప్రతిస్పందనగా మే 7న భారత సైన్యం ‘Operation Sindoor’ పేరుతో పాకిస్థాన్, POKలోని ఉగ్రవాద స్థావరాల(Terrorist bases)పై దాడులు నిర్వహించింది. దీంతో పాక్ తన గగనతలాన్ని మూసివేసింది.