Mana Enadu : ఏపీ డిప్యూటీ సీఎంగా తన బాధ్యత్లో పూర్తిగా నిమగ్నమైన పవన్ కల్యాణ్ (Pawan Kalyan) మరోవైపు తన సినిమాలపైన ఫోకస్ చేయనున్నారు. ప్రస్తుతం ఆయన చేతిలో ఉస్తాద్ భగత్ సింగ్, హరిహర వీరమల్లు, ఓజీ సినిమాలు ఉన్నాయి. ఇందులో ‘ఓజీ (OG)’ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. పవర్ స్టార్ ఫ్యాన్స్ పవన్ ఎక్కడి కనిపించినా ఓజీ ఓజీ అంటూ అప్డేట్స్ అడుగుతున్నారు. ఇటీవలే ఓ ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొన్న సమయంలో ‘ఓజీ.. ఓజీ..’ అంటూ అభిమానులు నినాదాలు చేయగా.. ‘‘ఏంటయ్యా మీరు. ఎప్పుడు ఏ స్లోగన్ ఇవ్వాలో మీకు తెలియదు. పక్కకు రండి’’ అంటూ చిరాకుపడ్డారు.
ఓజీ ఓజీ అంటుంటే భయమేస్తోంది
అయితే తాజాగా మంగళగిరిలో విలేకరులతో జరిగిన చిట్‌చాట్‌లో తన సినిమా విశేషాలను పవన్ షేర్ చేసుకున్నారు. ఇందులో భాగంగా ఓజీ గురించి కూడా మాట్లాడారు. ఈ సందర్భంగా ఓజీ సినిమా 1980-90ల మధ్య జరిగే కథ అని ఈ చిత్రానికి సంబంధించిన అప్డేట్ ఇచ్చారు. OG అంటే.. ఒరిజినల్ గ్యాంగ్ స్టర్ అని.. అభిమానులు ఎక్కడికి వెళ్లినా.. ‘OG OG’ అని అరుస్తుంటే అవి తనకు బెదిరింపుల్లాగా అనిపిస్తున్నాయని తెలిపారు.
నేను డేట్స్ ఇచ్చాను కానీ..
తాను ఒప్పుకొన్న అన్ని సినిమాలకూ డేట్స్ ఇచ్చానని.. వాళ్లే సరిగా సద్వినియోగం చేసుకోలేదని పవన్ కల్యాణ్ చెప్పుకొచ్చారు. ఇక ‘హరిహర వీరమల్లు’ (hari hara veera mallu) మరో ఎనిమిది రోజుల షూటింగ్ మాత్రమే ఉందని.. ఒకదాని తర్వాత ఒకటి అన్ని చిత్రాలు పూర్తి చేస్తానని పవన్ కల్యాణ్ తన అభిమానులకు హామీ ఇచ్చారు.
ఇండస్ట్రీలో మార్పు రావాలి
‘‘సినిమా ఇండస్ట్రీలో మార్పు రావాలి. ఇండస్ట్రీలోని పెద్దలంతా కూర్చొని ఈ విషయంపై సుదీర్ఘంగా, లోతుగా చర్చించాలి. రాష్ట్రంలో పాపికొండలు (Papi Kondalu) వంటి మంచి మంచి లొకేషన్లు ఉన్నాయి. విజయనగరం అటవీ ప్రాంతంలోనూ అందమైన ప్రాంతాలున్నాయి. ఈ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు అవసరం. ఇండస్ట్రీలో క్వాలిటీ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ ఉండాలి. స్టోరీ టెల్లింగ్ స్కూల్స్ వస్తేనే.. మంచి సినిమాలు వస్తాయి’’ అని పవన్ కల్యాణ్ అన్నారు.






