Mana Enadu : హైదరాబాద్ సంధ్య థియేటర్‌లో (Sandhya Theatre Case) పుష్ప-2 సినిమా బెనిఫిట్ షో సందర్భంగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ రావడంతో జరిగిన తొక్కిసలాట ఘటన దేశవ్యాప్తంగా దుమారం రేపిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో అల్లు అర్జున్ (Allu Arjun) అరెస్టయి బెయిల్ పై విడుదలయ్యారు. తాజాగా ఈ వివాదంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ స్పందించారు. మంగళగిరిలో మీడియాతో చిట్‌చాట్‌లో మాట్లాడిన ఆయన ఈ వ్యవహారం గురించి మాట్లాడుతూ.. గోటితో పోయే దాన్ని గొడ్డలి వరకు తెచ్చారని వ్యాఖ్యానించారు.
చట్టం అందరికీ సమానం
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) గొప్ప నాయకుడని.. కిందిస్థాయి నుంచి ఎదిగారని పవన్ కల్యాణ్ అన్నారు. వైస్సార్సీపీ విధానాల తరహాలో అక్కడ వ్యవహరించలేదని పేర్కొన్నారు. తెలంగాణలో ఆయన.. బెనిఫిట్‌షోలకు, టికెట్ ధర పెంపునకూ వెసులుబాటు కల్పించారని తెలిపారు. అల్లు అర్జున్ విషయంలో తెర ముందు, వెనుక ఏం జరిగిందో తనకు పూర్తిగా తెలియదన్న పవర్ స్టార్(Pawan Kalyan).. చట్టం అందరికీ సమానం అని వ్యాఖ్యానించారు.
ముందే వెళ్లి ఉంటే బాగుండేది
“అయితే ఇలాంటి ఘటనల్లో నేను పోలీసులను తప్పుపట్టను. భద్రత గురించే వారు ఆలోచిస్తారు. థియేటర్ స్టాఫ్ కూడా అల్లు అర్జున్‌కు ముందు చెప్పి ఉండాల్సింది. కనీసం సీట్లో ఆయన కూర్చున్నాక అయినా, చెప్పి తీసుకెళ్లాల్సింది. అల్లు అర్జున్ (Allu Arjun Case) తరఫున ఎవరో ఒకరు బాధిత కుటుంబం వద్దకు ముందే వెళ్లుంటే ఇంత దూరం రాకపోయేది. ఈ ఘటనలో రేవతి చనిపోవడం నన్ను కలచి వేసింది.” అని పవన్ కల్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు.
గోటితో పోయే దాన్ని గొడ్డలి వరకూ తెచ్చారు
గోటితో పోయే దాన్ని గొడ్డలి వరకూ తెచ్చారన్న డిప్యూటీ సీఎం.. మేమంతా అండగా ఉన్నామని ముందే చెప్పి ఉండాల్సిందని అభిప్రాయపడ్డారు. తన వల్లే ఒకరు చనిపోయారనే వేదన అర్జున్‌లో ఉందని తెలిపారు. సినిమా అంటే టీమ్.. అందరి భాగస్వామ్యం అని పేర్కొన్నారు. ఇక్కడ అల్లు అర్జున్ ఒక్కడినే దోషిగా మార్చడం కరెక్ట్‌కాదని.. చిరంజీవి (Chiranjeevi) కూడా గతంలో అభిమానులతో కలిసి సినిమాలు చూసేందుకు వెళ్లేవారని చెప్పారు. కాకపోతే ఆయన ముసుగు వేసుకుని ఒక్కరే థియేటర్‌కు వెళ్లేవారు అని పవన్ కల్యాణ్ వివరించారు.








