పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన చారిత్రక చిత్రం హరిహర వీర మల్లు ఇటీవల విడుదలై మిశ్రమ స్పందనతో పర్వాలేదనిపించుకుంది. మూడేళ్ల తర్వాత పవన్ సినిమా, పైగా చారిత్రక నేపథ్యంలో రూపొందడం ఈ చిత్రానికి భారీ హైప్ తీసుకొచ్చింది. అంతేకాకుండా, పవన్ కళ్యాణ్ స్వయంగా మీడియా ముందుకు వచ్చి విస్తృతంగా ప్రచారం చేయడంతో సినిమాకు అద్భుతమైన ఓపెనింగ్స్ లభించాయి. ఇప్పుడు ఈ చిత్రం డిజిటల్ స్ట్రీమింగ్‌కు సిద్ధమైంది.
సినిమా కథాంశం: 17వ శతాబ్దంలో జరిగిన కథగా రూపొందిన ఈ చిత్రంలో, కృష్ణా నది ఒడ్డున దొరికిన కోహినూర్ వజ్రం అనేక రాజుల చేతులు మారి మొగలుల వద్దకు చేరుతుంది. అదే సమయంలో, బ్రిటీష్ వారికి, పాలకులకు సింహస్వప్నంలా మారిన వీరమల్లు దొంగతనాలు చేస్తుంటాడు. ఒక చోరీ విషయంలో కుతుబ్ షాహీ సైనికులకు పట్టుబడతాడు. దక్కన్ ఆత్మగౌరవాన్ని తిరిగి తీసుకురావడానికి మొగలుల నుంచి కోహినూర్ వజ్రాన్ని తీసుకువస్తే, అడిగింది ఇస్తానని రాజు మాట ఇవ్వడంతో వీరమల్లు ఢిల్లీకి ప్రయాణమవుతాడు. ఈ క్రమంలో వీరమల్లుకు ఎదురైన సంఘటనలు, హిందువులపై జరుగుతున్న దాడుల పట్ల అతడి స్పందన, వీరమల్లు నేపథ్యం, చివరికి ఔరంగజేబును కలుసుకున్నాడా లేదా అనే విషయాల చుట్టూ కథ సాగుతుంది.
సినిమాలోని ఫస్టాఫ్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నప్పటికీ, ఢిల్లీ ప్రయాణం మొదలైన తర్వాత కథనం వేగం తగ్గింది. కొన్నిచోట్ల గ్రాఫిక్స్ నాణ్యత కూడా విమర్శలకు దారితీసింది. అయితే, కీరవాణి అందించిన సంగీతం సినిమాకు ప్రధాన బలంగా నిలిచింది. ఈ చిత్రం ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఆగష్టు 21 గురువారం నుంచి స్ట్రీమింగ్‌కు అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది.






