
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(Reserve Bank of India) (RBI) ఇప్పటికే రూ.2,000 నోటు(Notes)ను రద్దు చేసిందన్న విషయం తెలిసిందే. నోట్ల రద్దు ప్రకటన తర్వాత కొంతకాలం గడువు కూడా ఇచ్చినప్పటికీ, ఇంకా కొంతమంది వద్ద ఈ నోట్లు మిగిలి ఉన్నట్లు రిజర్వ్ బ్యాంక్ వెల్లడించింది. తాజాగా ఆర్బీఐ ఇచ్చిన నివేదిక ప్రకారం, రూ.6,017 కోట్ల విలువైన రూ.2వేల నోట్లు ఇప్పటికీ ప్రజల వద్దే ఉన్నట్లు వెల్లడించింది.
ఇవి చట్టబద్ధంగా చెల్లుబాటులో ఉన్నప్పటికీ, సాధారణ లావాదేవీల్లో వీటిని ఇక ఉపయోగించడం లేదు. మే 19, 2023న ఆర్బీఐ రూ.2వేల నోటును చలామణి నుండి తిరిగి తీసుకుంటున్నట్లు ప్రకటించింది.. అప్పట్లో చెలామణిలో ఉన్న రూ.2వేల నోట్ల మొత్తం విలువ రూ.3.56 లక్షల కోట్లు కాగా, 2025 జూలై 31 నాటికి అది రూ.6,017 కోట్లకు తగ్గిందని తెలిపింది. అంటే, ఇప్పటి వరకు 98.31 శాతం నోట్లు బ్యాంకుకు తిరిగి వచ్చాయి.
2023 అక్టోబర్ 9 నుండి ఆర్బీఐ 19 ప్రధాన కార్యాలయాల ద్వారా రూ.2వేల నోట్లు బ్యాంకు ఖాతాల్లో జమ చేసుకునే అవకాశం కల్పిస్తోంది. వ్యక్తులు, సంస్థలు పోస్టాఫీస్ సేవలను ఉపయోగించి ఆర్బీఐ ఇష్యూ కార్యాలయాలకు నోట్లను పంపించి తమ ఖాతాలో జమ చేయించుకోవచ్చు. ఈ కేంద్రాలు దేశవ్యాప్తంగా అహ్మదాబాద్, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, ముంబై, ఢిల్లీ తదితర నగరాల్లో ఉన్నాయి. మొత్తానికి, ఇంకా మీ దగ్గర రూ.2వేల నోట్లు ఉంటే, వాటిని చట్టబద్ధంగా బ్యాంక్ ఖాతాల్లో జమ చేసుకోవచ్చు. కానీ లావాదేవీల్లో మాత్రం వాడకూడదు.