
దేశవ్యాప్తంగా కోట్లాది మంది రైతులు(farmers) ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (PM KISAN) 20వ విడత నిధుల కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే 19 విడతలుగా నగదు బదిలీ చేసిన కేంద్ర ప్రభుత్వం, తాజాగా 20వ విడత నిధులను విడుదల చేయాల్సి ఉంది. అయితే, ఇప్పటికీ నిధుల విడుదల తేదీపై స్పష్టత లేదు.
గత విడతగా ఫిబ్రవరి 24, 2025న బిహార్‌లోని భాగల్పూర్‌లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా రైతులకు నిధులు జమయ్యాయి. మొత్తం 9.8 కోట్ల మంది రైతులకు ఈ పథకం ద్వారా ప్రయోజనం లభించగా, ఇందులో 2.41 కోట్ల మంది మహిళా రైతులు కూడా ఉన్నారు. ఇప్పటి వరకూ రైతులకు రూ. 22,000 కోట్ల మేర ప్రత్యక్ష ఆర్థిక సహాయం అందింది.
ఈ పథకంలో అర్హత పొందిన ప్రతి వ్యవసాయ కుటుంబానికి సంవత్సరానికి మూడు విడతలుగా రూ. 6,000 చొప్పున నిధులు జమ చేస్తారు. ఒక్కో విడతలో రూ. 2,000 చొప్పున ఇస్తారు. గత విడత చెల్లింపుల ప్రకారం, జూన్ చివరి నాటికి కొత్త విడత నిధులు విడుదల కావాల్సి ఉండగా, ఈ ప్రక్రియ వాయిదాపడుతోంది. దీంతో రైతులు తీవ్ర అసంతృప్తితో ఎదురుచూస్తున్నారు.
ఈ నేపథ్యంలో జులై 18న ప్రధాని మోదీ(Narendra Modi) బిహార్‌లోని మోతిహరి ప్రాంతాన్ని సందర్శించనున్నారు. అక్కడినుంచే పీఎం కిసాన్ 20వ విడత నిధులు విడుదలయ్యే అవకాశం ఉందన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇదే విషయాన్ని బిహార్ బీజేపీ అధ్యక్షుడు దిలీప్ కుమార్ జైస్వాల్ కూడా పేర్కొన్నారు.
e-KYC తప్పనిసరి:
నిధుల విడుదలకు ముందు రైతులు తప్పనిసరిగా e-KYC, భూమి ధృవీకరణ వంటి ముఖ్యమైన ప్రక్రియలను పూర్తి చేయాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియను పూర్తి చేయని వారికి నిధులు రాకపోవచ్చు..
e-KYC పూర్తిచేయడానికి మూడు మార్గాలు ఉన్నాయి:
- PM-KISAN మొబైల్ యాప్ లో ఫేస్ అథెంటికేషన్ ద్వారా e-KYC చేయవచ్చు.
- CSCలు / రాష్ట్ర సేవా కేంద్రాల్లో బయోమెట్రిక్ ఆధారిత e-కీచ్ చేసుకోవచ్చు.
- ఆధికారిక వెబ్‌సైట్ లేదా యాప్‌లో OTP ఆధారంగా e-కీచ్ చేయవచ్చు.
e-KYC పూర్తి చేసే విధానం:
స్టెప్ 1: pmkisan.gov.in వెబ్‌సైట్ ఓపెన్ చేయండి
స్టెప్ 2: ‘రైతు కార్నర్’ సెక్షన్‌లోకి వెళ్లండి
స్టెప్ 3: ‘e-KYC’ లేదా ‘మొబైల్ నంబర్ అప్‌డేట్’ క్లిక్ చేయండి
స్టెప్ 4: ఆధార్ నెంబర్ నమోదు చేసి, OTPతో ధృవీకరించండి
లబ్ధిదారుల జాబితాలో పేరు ఉందో లేదో ఇలా చెక్ చేయండి:
స్టెప్ 1: pmkisan.gov.in వెబ్‌సైట్‌కి వెళ్లండి
స్టెప్ 2: ‘లబ్ధిదారుల జాబితా’పై క్లిక్ చేయండి
స్టెప్ 3: రాష్ట్రం, జిల్లా, మండలం, గ్రామం వంటి వివరాలు ఎంచుకోండి
స్టెప్ 4: ‘నివేదిక పొందండి’పై క్లిక్ చేయండి
స్టెప్ 5: మీ పేరు జాబితాలో ఉందో లేదో చెక్ చేయండి
ముఖ్యమైన సూచన:
ఆధార్ కార్డు తప్పనిసరిగా బ్యాంక్ ఖాతాకు లింక్ అయ్యి ఉండాలి. రైతు పేరు, పుట్టిన తేదీ, బ్యాంక్ డీటెయిల్స్ IFSC లేదా MICR కోడ్, మొబైల్ నంబర్, ఆధార్ నంబర్ వంటి సమాచారాన్ని యాప్‌లో అప్‌డేట్ చేయాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియలు పూర్తి చేస్తే మాత్రమే 20వ విడత నిధులు మీ ఖాతాలోకి జమయ్యే అవకాశం ఉంటుంది. అందుకే అర్హులైన రైతులు వెంటనే ఈ పనులను పూర్తిచేయాలి.